ముంబై: వచ్చే సీజన్ కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీలు తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్లతో పాటు వేలానికి వదిలేసే ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి. శనివారం (నవంబర్ 15)తో రిటెన్షన్ గడువు ముగియడంతో అన్ని ఫ్రాంచైజీలు తాము రిటైన్, రిలీజ్ చేసే ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి. వీరిలో ముఖ్యంగా 11 సీజన్ల పాటు కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)కు ఆడిన ఆండ్రూ రసెల్‌ను ఆ ఫ్రాంచైజీ రిటైన్ చేసుకోలేదు. అంతేగాక నిరుటి వేలంలో రికార్డు ధర పలికిన వెంకటేశ్ అయ్యర్ (రూ. 23.75 కోట్లు), అన్రిచ్ నోకియా (రూ. 6.5 కోట్లు), క్వింటన్ డికాక్ (రూ. 3.6 కోట్లు)నూ ఆ జట్టు వదిలించుకుంది. పంజాబ్ కింగ్స్ కూడా గ్లెన్ మ్యాక్స్‌వెల్ (రూ. 4.20 కోట్లు), జోష్ ఇంగ్లిస్ (రూ. 2.5 కోట్లు) వంటి హిట్టర్లను రిలీజ్ చేసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్).. సీనియర్ పేసర్ మహ్మద్ షమీ (రూ. 10 కోట్లు) లక్నోకు ట్రేడ్ చేసింది.
ఇక అందరూ ఊహించినట్టుగానే సంజూ శాంసన్ (రాజస్థాన్ నుంచి చెన్నైకి), రవీంద్ర జడేజా (చెన్నై నుంచి రాజస్థాన్‌కు) ట్రేడ్ విజయవంతంగా పూర్తైంది. ఢిల్లీ.. యువ సంచలనం జేక్ ఫ్రేసర్ (రూ. 9 కోట్లు)తో పాటు హ్యారీ బ్రూక్ (రూ. 6.25 కోట్లు), డుప్లెసిస్ (రూ. 2 కోట్లు)ను వదిలించుకుంది. లివింగ్‌స్టొన్ (రూ. 8.75 కోట్లు)ను బెంగళూరు రిటైన్ చేసుకోలేదు. ముంబై, బెంగళూరు, గుజరాత్ తమ ప్రధాన ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి. ఆశ్చర్యకరంగా చెన్నై.. ఆ జట్టు తురుపు ముక్క పతీరాన (రూ. 13 కోట్లు), కాన్వే (రూ. 6.25 కోట్లు), రచిన్ రవీంద్ర (రూ. 4.20 కోట్లు) వంటి స్టార్ ప్లేయర్లను వదులుకోవడం గమనార్హం. హైదరాబాద్ కూడా రాహుల్ చాహర్, అభినవ్ మనోహర్, ఆడమ్ జంపా, వియాన్ మల్డర్ వంటి ఆటగాళ్లను రిటైన్ చేసుకోలేదు.

రిటెన్షన్ ప్రక్రియలో మిగిలిన జట్లతో పోలిస్తే చెన్నై, కోల్‌కతా తమ జట్లను పూర్తిగా పునరుద్ధరించేందుకు సిద్ధమయ్యాయి. సీఎస్కే దాదాపు 12 మందిని, కేకేఆర్ 10 మంది ఆటగాళ్లను వేలానికి వదిలేసింది. రిలీజ్ చేసిన ఆటగాళ్లు పోగా కోల్‌కతా వద్ద అత్యధికంగా రూ. 64.3 కోట్లు ఉండగా చెన్నై రూ. 43.4 కోట్లతో రెండో స్థానంలో ఉన్నాయి. డిసెంబర్ 16న జరుగబోయే మినీవేలంలో ఈ రెండు జట్ల మధ్యే ప్రధాన పోటీ ఉండనుంది. హైదరాబాద్, లక్నో, ఢిల్లీ కూడా వేలం రేసులో ముందు వరుసలో ఉన్నాయి. అందరికంటే తక్కువగా ముంబై ఇండియన్స్ వద్ద రూ. 2.75 కోట్లు మాత్రమే మిగిలుంది.
