IPL | ధర్మశాల : ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ అర్ధాంతరంగా ముగిసిన నేపథ్యంలో ఐపీఎల్‌పై యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న క్రమంలో లీగ్ కొనసాగుతుందా లేదా అన్న దానిపై అస్పష్టత నెలకొన్నది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ప్రారంభించిన ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా పాక్‌పై మన త్రివిధ దళాలు ముప్పేట దాడికి పాల్పడుతున్నాయి. బుధవారం భారత్ సరిహద్దును ఆనుకుని ఉన్న ఉగ్ర స్థావరాలపై మన సైన్యం ఊహించని రీతిలో విరుచుకుపడింది. దీనిపై లీగ్ చైర్మన్ అనిల్ ధుమాల్ స్పందిస్తూ ‘పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాం.
భారత్, పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతున్నది. ఇప్పటికైతే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. అన్నింటిని దృష్టిలో పెట్టుకుని లీగ్ నిర్వహణపై నిర్ణయం తీసుకుంటాం’ అని అన్నారు. మరోవైపు లీగ్ రద్దు వార్తలను బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తోసిపుచ్చారు. ‘ఇదంతా ఫేక్‌న్యూస్. ఇప్పటికైతే ధర్మశాల మ్యాచ్ ఒకటే రద్దయ్యింది. దేశంలో మాకు వేర్వేరు వేదికలు ఉన్నాయి. బీసీసీఐ ఎమర్జెన్సీ భేటీ ఏమి లేదు. ఇలాంటి తప్పుడు వార్తలను వ్యాప్తి చేయవద్దు’ అని మీడియా ప్రకటనలో కోరారు.