అహ్మదాబాద్: ఐపీఎల్ సీజన్ 16లో ముంబై ఇండియన్స్ టీమ్ వరుసగా ఓటమి పాలవుతుండటంతో ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ కీలక సలహా ఇచ్చారు. మంగళవారం గుజరాత్ టైటాన్స్‌తో ముంబై ఇండియన్స్ ఓటమి అనంతరం గవాస్కర్ స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. రోహిత్ శర్మకు కొన్ని రోజులు బ్రేక్ అవసరం అన్నారు.
‘ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఆర్డర్లో కొన్ని మార్పులు చూడాలనుకుంటున్నా. నిజాయితీగా నేను ఇంకో మాట కూడా చెప్పదలుచుకున్నా. కొన్ని రోజులపాటు రోహిత్ శర్మ ఆట నుంచి బ్రేక్ తీసుకుంటే మంచిదని భావిస్తున్నా. ఐపీఎల్లో కొన్ని మ్యాచ్‌ల నుంచి బ్రేక్ తీసుకుని, ఆఖర్లో మూడు నాలుగు మ్యాచ్‌లకు తిరిగి అందుబాటులోకి వస్తే మంచిదని నా అభిప్రాయం’ అని గవాస్కర్ పేర్కొన్నారు.
‘ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ తలపడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆ మ్యాచ్‌కల్లా రోహిత్ ఫిట్‌గా ఉండటం అవసరం. కాబట్టి ఐపీఎల్లో కొన్ని మ్యాచ్‌ల నుంచి బ్రేక్ తీసుకుని, ఆఖర్లో తన ఫామ్‌ను తిరిగి అందిపుచ్చుకుంటే బాగుంటుంది’ అని గవాస్కర్ సలహా ఇచ్చారు. మంగళవారం గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 55 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌తో ముంబై తదుపరి మ్యాచ్ ఆడనుంది.