గతేడాది కరోనా కారణంగా క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ రెండో సగం యూఏఈలో నిర్వహించిన సంగతి తెలిసిందే. అక్కడ నాలుగు మైదానాల్లో సగం ఐపీఎల్ మ్యాచులు జరిగాయి. దీని కారణంగా పిచ్‌లు పట్టు కోల్పోయి మ్యాచులు రసవత్తరంగా సాగలేదు. ఇప్పుడు కూడా కరోనా కారణంగా ఐపీఎల్ మొత్తాన్ని ముంబై, పూణేల్లోని నాలుగు మైదానాల్లో నిర్వహించాలని ఐపీఎల్ యాజమాన్యం నిర్ణయించింది.
అంటే యూఏఈలో జరిగినట్లే పిచ్‌లు పట్టు కోల్పోయే ప్రమాదం ఉంది. అయితే అలా జరగకూడదని గ్రౌండ్ ఇంచార్జి నదీమ్ మెమోన్ కొత్త ప్లాన్ వేశారు. ప్రతి మైదానంలో ఐదు పిచ్‌లు సిద్ధం చేయిస్తున్నట్లు చెప్పారు. కొన్ని మ్యాచులు జరిగిన ప్రతిసారీ ఈ పిచ్‌లు రొటేట్ చేస్తామని వివరించారు. దీంతో ఈ టోర్నీలో డెడ్ పిచ్‌లు కనిపించబోవని తెలిపారు. అలాగే యూఏఈలో ఉన్నట్లు మంచు ప్రభావం భారత్‌లో ఉండదని, అది కూడా ముంబైలో మంచు అంతగా ఉండదని అన్నారు.
ఒకవేళ్ల కొద్దోగొప్పో మంచు ప్రభావం ఉన్నా కూడా అది రాత్రి 9.30 దాటిన తర్వాతే కనిపిస్తుందని, అది కూడా చాలా తక్కువ కావడంతో సూపర్ సక్కర్లతో ఆ సమస్య కూడా ఉండదని స్పష్టం చేశారు. యూఏఈ పిచ్‌ల కోసం పాకిస్తాన్ నుంచి మట్టిని తీసుకెళ్తారని.. అందుకే అక్కడ ఫ్లాట్ పిచ్‌లు ఉన్నాయని చెప్పిన నదీమ్.. ముంబైలోని పిచ్‌లలో బౌన్స్ ఉంటుందని, ఈసారి ఐపీఎల్ మ్యాచులు చాలా రసవత్తరంగా సాగుతాయని హామీ ఇచ్చారు. మరి కొన్ని రోజుల్లో ఐపీఎల్ షురూ అవనున్న నేపథ్యంలో.. నదీమ్ మాటలు క్రికెట్ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతన్నాయి.