హైదరాబాద్: విరాట్ కోహ్లీ లాంటి క్రికెటర్లకు భారత్‌లో కొదువలేదని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. వెన్నుతట్టి ప్రోత్సహించాలే కానీ కోహ్లీ వంటి క్రికెటర్లు వెలుగులోకి వస్తారని అన్నారు. మీడియాతో సరదాగా మాట్లాడిన అసద్ తన కాలేజీ రోజుల్లో క్రికెట్ కెరీర్‌పై ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. ‘90వ దశకం తొలినాళ్లలో ఇంటర్ యూనివర్సిటీ టోర్నీలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీ, బెంగళూరు యూనివర్సిటీ మధ్య మ్యాచ్ జరిగింది.
అందులో మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ విఫలమైన చోట నేను మీడియం పేసర్‌గా 79 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాను. కానీ ఆ మ్యాచ్‌లో ఓయూ ఓడిపోయింది. ఆ తర్వాత సౌత్‌జోన్, అండర్-25, విజ్జి ట్రోఫీ లాంటి టోర్నీలు ఆడాను. 1994లో లా చదివేందుకు లండన్ వెళ్లడంతో క్రికెట్ కెరీర్‌కు అర్ధాంతరంగా ముగిసింది. అజారుద్దీన్ లాంటి క్రికెటర్‌తో నేను పోల్చుకోను.
భారత్ తరఫున అతను 99 టెస్టులాడిన దిగ్గజ క్రికెటర్, నేనొక సాధారణ మీడియం పేసర్. రాజకీయ నాయకునిగా అతనితో విబేధాలు ఉన్నా..క్రికెటర్‌గా అజర్ ప్రతిభ అసాధారణం. భారత క్రికెట్లో పరిస్థితులు చాలా మారాయి. పేద కుటుంబం నుంచి వచ్చిన సిరాజ్ ఇప్పుడు స్టార్ క్రికెటర్‌గా ఎదిగాడు. ప్రతిభకు తగ్గట్లు బీసీసీఐ క్రికెటర్లను ప్రోత్సహించడం మంచి పరిణామం. సరైన ప్రోత్సాహం అందిస్తే కోహ్లీ లాంటి క్రికెటర్లు చాలా మంది వెలుగులోకి వస్తారు. టెస్టులకు కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడం నిరాశ కల్గించినా..అతని ఆటతీరు అద్భుతం. ముఖ్యంగా కోహ్లీ కవర్‌డ్రైవ్ షాట్ క్లాసిక్’ అని అన్నారు.