చెంగ్డూ: ప్రతిష్టాత్మక థామస్ కప్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత జట్టుకు ఇండోనేషియా షాకిచ్చింది. గ్రూప్ దశ చివరి లీగ్ మ్యాచ్‌లో ఇండోనేషియా 4-1 తేడాతో భారత్‌ను ఓడించి 2022 థామస్ కప్ ఫైనల్స్ ఓటమికి బదులు తీర్చుకుంది. హెచ్ఎస్ ప్రణయ్ తప్ప రెండు సింగిల్స్, రెండు డబుల్స్ మ్యాచ్‌లలోనూ భారత్‌కు ఓటమే ఎదురైంది. ప్రణయ్ 13-21, 21-12, 21-12 తేడాతో ఆంథోని గింటింగ్‌ను ఓడించి భారత్‌కు ఆధిక్యాన్ని అందించాడు. కానీ వరల్డ్ నంబర్‌వన్ డబుల్స్ జోడీ సాత్విక్- చిరాగ్.. 22-24, 24-22, 21-19 తేడాతో షోయిబుల్ ఫిక్రి-బగస్ మౌలానా చేతిలో ఓడింది. లక్ష్యసేన్.. 18-21, 21-16, 17-21 తేడాతో జొనాథన్ క్రిస్టీతో పోరాడి ఓడాడు. రెండో డబుల్స్‌లో ధ్రువ్-సాయి 22-20, 21-11 తో లియో రొలీ-డానియల్ మార్టిన్‌కు తలవంచారు. చివరి సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ 21-19 తేడాతో తొలి గేమ్ గెలిచినా ఆ తర్వాత వరుసగా రెండు గేమ్‌లలో 22-24, 14-21 కోల్పోయాడు. ఈ ఓటమితో భారత్ గ్రూప్ దశలో రెండో స్థానంలో నిలిచింది.