ఆసియాకప్‌లో భారత్ విజయదుందుభి మోగించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను పాతరేస్తూ ఫైనల్లో అదరగొట్టింది. టోర్నీలో ముచ్చటగా మూడోసారి దాయాదిని మట్టికరిపించిన టీమ్ ఇండియా దుబాయ్ నడిగడ్డపై మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించింది. పహల్గాం ఉగ్రదాడితో ఇరు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న పరిస్థితిలో భారత్ తమ సత్తాఏంటో చేతల్లో చూపెట్టింది. సమిష్టి ప్రదర్శనతో కదంతొక్కుతూ పాక్‌ను ఓడించిన టీమ్ఇండియా…రికార్డు స్థాయిలో తొమ్మిదో సారి ఆసియాకప్‌ను సగర్వంగా ముద్దాడింది. తన స్పిన్ మాయాజాలంతో కుల్దీప్..పాక్ నడ్డివిరిస్తే లక్ష్య ఛేదనలో హైదరాబాదీ తిలక్‌వర్మ సూపర్ ఇన్నింగ్స్‌తో భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని కట్టబెట్టాడు. సహచరులు విఫలమైన చోట తన విలువ చాటిన తిలక్..దేశ ప్రజలకు విలువైన దసరా కానుక అందించాడు. అజేయ అర్ధసెంచరీతో కదంతొక్కి ఆపరేషన్ తిలక్‌తో భారత్‌కు
విజయ తిలకాన్ని దిద్దాడు.
దుబాయ్: పదిహేను రోజుల వ్యవధిలో దాయాది పాకిస్థాన్‌తో ముచ్చటగా మూడోసారి జరిగిన పోరులో భారత్‌దే (Team India) పైచేయి. టోర్నీలో అపజయమన్నదే లేకుండా సాగిన టీమ్ఇండియా.. ఆదివారం చిరకాల ప్రత్యరితో ఆద్యంతం ఉత్కంఠగా జరిగిన ఆసియా కప్ (Asia Cup) ఫైనల్లో ఆ జట్టును 5 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. ఈ టోర్నీలో టైటిల్ గెలవడం భారత్‌కు ఇది తొమ్మిదోసారి. పాక్ నిర్దేశించిన 147 పరుగుల ఛేదనను భారత్ 19.3 ఓవర్లలో పూర్తిచేసింది. తిలక్ వర్మ (53 బంతుల్లో 69 నాటౌట్, 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడగా, శివమ్ దూబె (22 బంతుల్లో 33, 2 ఫోర్లు, 2 సిక్సర్లు), సంజూ శాంసన్ (24) రాణించారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పాక్.. భారత స్పిన్నర్ల మాయకు విలవిల్లాడింది. కుల్దీప్ యాదవ్ (4/30), అక్షర్ పటేల్ (2/26), వరుణ్ చక్రవర్తి (2/30)తో పాటు పేసర్ జస్ప్రీత్ బుమ్రా (2/25) ధాటికి ఆ జట్టు 19.1 ఓవర్లలో 146కు చేతులెత్తేసింది. సాహిబ్జాదా ఫర్హాన్ (38 బంతుల్లో 57, 5 ఫోర్లు, 3 సిక్సర్లు), ఫకర్ జమాన్ (35 బంతుల్లో 46, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మినహా ఏకంగా 8 మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.
తిలక్ తడాఖా
స్వల్ప ఛేదనలో టీమ్ఇండియా తడబడింది. టోర్నీలో సూపర్ ఫామ్‌లో ఉన్న అభిషేక్ (5) బౌండరీతో ఇన్నింగ్స్‌ను ఆరంభించినా ఫహీమ్ రెండో ఓవర్లో స్లో బంతిని తప్పుగా అంచనా వేసి మిడాన్‌లో రౌఫ్ చేతికి చిక్కాడు. ఆ వెంటనే అఫ్రిది బౌలింగ్‌లో కెప్టెన్ సూర్య (1).. అనవసరపు షాట్ ఆడి పాక్ సారథి సల్మాన్ క్యాచ్‌తో వెనుదిరిగాడు. ఫహీమ్ తన తర్వాతి ఓవర్లో గిల్ (12)నూ ఔట్ చేయడంతో భారత్ ఒత్తిడికి గురైంది. కానీ మిడిలార్డర్లో తిలక్, సంజూ జట్టును ఆదుకున్నారు. ఈ ఇద్దరూ ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఆడుతూ లక్ష్యాన్ని కరిగించారు. ఫహీమ్ 6వ ఓవర్లో తిలక్ 4,6 బాదాడు. 12 పరుగుల వద్ద తలాత్ క్యాచ్ మిస్ చేయడంతో బతికిపోయిన సంజూ.. క్రీజులో కుదురుకున్నట్టే కనిపించినా అబ్రర్ 13వ ఓవర్లో షాట్ ఆడబోయి ఫర్హాన్‌కు క్యాచ్ ఇవ్వడంతో 57 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. అబ్రార్ 16వ ఓవర్లో ఆఖరి బంతికి సింగిల్ తీసిన తిలక్.. 41 బంతుల్లో ఫిఫ్టీ పూర్తిచేశాడు. దూబె అండతో తిలక్ భారత్‌ను గెలుపు దిశగా నడిపించాడు. పాక్ బౌలర్లు కాస్త కట్టుదిట్టంగా బంతులేసినా ఈ జోడీ తడబడకుండా ఆడింది. విజయానికి పది పరుగుల దూరంలో దూబె నిష్క్రమించినా రింకూ సింగ్ (4*)తో కలిసి తిలక్ గెలుపు లాంఛనాన్ని పూర్తిచేశాడు.
వాళ్లిద్దరిదే ఆట..
పాకిస్థాన్ ఇన్నింగ్స్‌ను మొదటి 9 ఓవర్లకు ముందు.. తర్వాతగా అభివర్ణించవచ్చు. ఆ జట్టులో ఓపెనర్లదే ఆట. హార్ధిక్ గాయంతో మ్యాచ్‌కు దూరమవగా బుమ్రాకు జతగా శివమ్ దూబె పేస్ బాధ్యతలను మోశాడు. కానీ పాక్ ఓపెనర్లు ఈ ఇద్దరినీ దీటుగా ఎదుర్కున్నారు. గత మ్యాచ్‌లో మాదిరిగానే ఓపెనర్ ఫర్హాన్ ఆరంభం నుంచే బుమ్రా బౌలింగ్‌లో ఎదురుదాడికి దిగాడు. నాలుగో ఓవర్లో అతడు 4, 6 బాదాడు. కుల్దీప్ 9వ ఓవర్లో రెండో బంతికి ఫకర్ స్లాగ్ స్వీప్‌తో సిక్సర్ కొట్టగా నాలుగో బంతికి రెండు రన్స్ తీసిన ఫర్హాన్ భారత్‌పై వరుసగా రెండో అర్ధ శతకాన్ని నమోదుచేశాడు. ఈ ఇద్దరి జోరు చూస్తే పాక్ భారీ స్కోరు చేసేట్టే కనిపించింది.
33 పరుగులు.. 9 వికెట్లు..
84/0.. 9.3 ఓవర్లకు పాక్ స్కోరిది. కానీ అనిశ్చితికి మారుపేరైన పాక్ 12.4 ఓవర్లలో 113-1తో మెరుగ్గానే కనిపించినా 33 పరుగుల వ్యవధిలో ఆఖరి 9 వికెట్లను కోల్పోయింది. వరుణ్ తన రెండో స్పెల్‌లో ఫర్హాన్‌ను ఔట్ చేసి భారత్‌కు తొలి బ్రేక్‌ను అందించాడు. పాక్ ఇన్నింగ్స్‌లో ఇదే టర్నింగ్ పాయింట్. కుల్దీప్ 13వ ఓవర్లో సైమ్ అయూబ్ (14) బ్యాక్వర్డ్ పాయింట్ వద్ద బుమ్రాకు క్యాచ్ ఇచ్చాడు. అక్షర్ 14వ ఓవర్లో మహ్మద్ హరీస్.. రింకూ సింగ్ చేతికి చిక్కాడు. వరుణ్ 15వ ఓవర్లో మూడో బంతికి సిక్స్ కొట్టిన ఫకర్.. నాలుగో బంతికి కుల్దీప్ సూపర్ క్యాచ్‌తో పెవిలియన్ చేరాడు. ఫకర్ నిష్క్రమించాక పాక్ ఇన్నింగ్స్‌లో ఒక్క బ్యాటర్ కూడా డబుల్ డిజిట్ స్కోరు చేయలేదు. అక్షర్ 16వ ఓవర్లో తలాత్ (1) ఔటయ్యాడు. ఇక కుల్దీప్ 17వ ఓవర్లో సల్మాన్ అలీ అఘా (8), షహీన్ అఫ్రిది, ఫహీమ్ పనిపట్టాడు. బుమ్రా.. హరీస్ రౌఫ్ (6), నవాజ్‌ను ఔట్ చేసి పాక్ ఇన్నింగ్స్‌కు తెరదించాడు.
సంక్షిప్త స్కోర్లు
పాకిస్థాన్: 19.1 ఓవర్లలో 146 ఆలౌట్ (ఫర్హాన్ 57, ఫకర్ 46, కుల్దీప్ 4/30, బుమ్రా 2/25); భారత్: 19.3 ఓవర్లలో 150/5 (తిలక్ 69*, దూబె 33, ఫహీమ్ 3/29, అఫ్రిది 1/20)
ఆసియా కప్ ఫైనల్లో పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇరు దేశాల ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే ప్లేయర్ల కరచాలనంతో రచ్చ చెలరేగగా, తాజాగా ట్రోఫీ ప్రదాన కార్యక్రమం మరింత నిప్పు రాజేసింది. తుది పోరు దాదాపు 12 గంటలకు(భారత కాలమానం ప్రకారం) పూర్తి కాగా, గంటకు పైగా వేచిచూడాల్సి వచ్చింది. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక అభిమానులు ట్రోఫీ ఎప్పుడు ఇస్తారా అని ఎదురుచూశారు. మరోవైపు స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు తమ అభిమాన జట్టు ట్రోఫీ అందుకునే సందర్భంగా అలాగే ఉండిపోయారు. అయితే ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) అధ్యక్షుడుగా ఉన్న మోహసిన్ నక్వి చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు టీమ్ఇండియా ససేమిరా అన్నట్లు తెలిసింది.
దీనికి తోడు ఓడిన నైరాశ్యంలో ఉన్న పాక్ టీమ్..డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకు వచ్చేందుకు నాటకాలు ఆడింది. దీంతో కామెంటరీ ప్యానెల్లో ఉన్న రవిశాస్త్రి, వసీం అక్రమ్, మంజ్రేకర్ ముగింపు కార్యక్రమ నిర్వహణపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మొదలైన కార్యక్రమం అసలు ట్రోఫీ ఇవ్వకుండానే ముగియడం కొత్త వివాదానికి దారి తీసింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా తిలక్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా అభిషేక్‌శర్మ నిలువగా, పాక్ ప్లేయర్లు రన్నరప్ చెక్ అందుకున్నారు. అయితే చెక్‌ను పాక్ కెప్టెన్ సల్మాన్ ఆగా స్టేజ్‌పై విసిరివేయడం లైవ్‌లో కనిపించింది. మొత్తంగా నక్వీ చేతుల మీదుగా భారత్ ట్రోఫీ తీసుకోకుండానే కార్యక్రమం ముగిసింది.
ఆసియాకప్ ఫైనల్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సాధారణంగా ఇరు జట్ల కెప్టెన్లు టాస్ వేసే సమయంలో ఒకరు వ్యాఖ్యాతగా వ్యవహరించడం ఆనవాయితీ. కానీ దాయాదుల మధ్య ఉద్రిక్త పరిస్థితులకు అద్దం పడుతూ అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నడూ లేని విధంగా తొలిసారి ఇద్దరు వ్యాఖ్యాతలు ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది. టాస్ గెలిచిన వెంటనే కెప్టెన్ సూర్యకుమార్‌తో భారత్‌కు చెందిన రవిశాస్త్రి మాట్లాడగా, పాక్ సారథి సల్మాన్ఆగాతో వకార్ యూనిస్ సంభాషించడం కనిపించింది. అయితే దీని వెనుక పెద్ద తతంగమే జరిగినట్లు తెలిసింది. గత రెండు మ్యాచ్‌లకు అధికారిక వ్యాఖ్యాతగా వ్యవహరించిన రవిశాస్త్రి వద్దంటూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)..ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ)కు ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని ఏసీసీ.. బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లగా రవిశాస్త్రిని తప్చించేందుకు బోర్డు ససేమిరా అంది. దీంతో మధ్యేమార్గంగా నిర్వాహకులు ఇద్దరు వ్యాఖ్యాతలతో టాస్ కానిచ్చేశారు. ఇదిలా ఉంటే ఫైనల్‌కు ముందు కెప్టెన్ల ట్రోఫీ ఫొటో షూటౌట్ గురించి తమకు చెప్పలేదని బీసీసీఐ స్పష్టం చేసింది.