మాలె: సాఫ్ అండర్-20 ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో భారత్ అద్భుత ప్రదర్శన కొనసాగుతున్నది. శనివారం భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన గ్రూపు-బీ పోరు 1-1తో డ్రాగా ముగిసింది. పాకిస్థాన్‌పై ఘన విజయంతో టోర్నీని ఆరంభించిన యువ భారత్..బంగ్లాతో మ్యాచ్‌లోనూ అదే జోరు ప్రదర్శించింది. మ్యాచ్ మొదలైన 17వ నిమిషంలోనే విశాల్ యాదవ్ గోల్ చేయడంతో భారత్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.
అయితే ప్రథమార్ధం మరికొద్ది క్షణాల్లో ముగుస్తుందన్న తరుణంలో అబ్దుల్ రియాద్ ఫహీమ్(45ని) గోల్ చేయడంతో స్కోరు సమమైంది. ద్వితీయార్ధంలో రెండు జట్లు గోల్ కోసం ప్రయత్నం చేసినప్పటికీ సాధ్యం కాలేదు. ఈ డ్రాతో అగ్రస్థానంలో నిలిచిన భారత్ ఇప్పటికే సెమీఫైనల్ బెర్తు ఖాయం చేసుకోగా, బంగ్లా గ్రూపులో రెండో స్థానానికి పరిమితమైంది. బుధవారం జరిగే సెమీస్‌లో మహేశ్ గవాలీ సారథ్యంలోని భారత్ తలపడుతుంది.