మాడ్రిడ్: ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్4లో భారత మహిళల కాంపౌండ్ జట్టు ఫైనల్ చేరుకొని స్వర్ణ పతకం ముంగిట నిలిచింది. తెలంగాణ యంగ్ ఆర్చర్ తానిపర్తి చికిత, ఏపీ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ, ప్రతీక ప్రదీప్తో కూడిన జట్టు బుధవారం జరిగిన సెమీఫైనల్లో 231-228 తేడాతో దక్షిణ కొరియాపై గెలిచి స్వర్ణ పోరుకు చేరుకుంది. శనివారం జరిగే తుదిపోరులో టాప్ సీడ్తో తలపడనుంది. వ్యక్తిగత ఈవెంట్లలో పర్ణీత్ కౌర్ మినహా భారత అమ్మాయిలంతా రౌండ్-32 చేరుకొని పతక రేసులో నిలిచారు. మరోవైపు పురుషుల కాంపౌండ్ జట్టు కొద్దిలో కాంస్య పతకం కోల్పోయింది. సాహిల్ జాదవ్, గణేశ్ మణిరత్నం, తిరుమురు, కుశాల్తో కూడిన టాప్ సీడ్ భారత్ కాంస్య పతక ప్లేఆఫ్ మ్యాచ్లో 232-233తో ఒక్క పాయింట్ తేడాతో జర్మనీ చేతిలో పరాజయం పాలైంది. అంతకుముందు హోరాహోరీగా సాగిన సెమీస్లో మెక్సికో చేతిలో షూటౌట్లో ఓడిపోయింది.