చెస్టర్ లీ స్ట్రీట్: ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్ టోర్నీకి ముందు భారత మహిళల జట్టు సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటింది. టీ20 సిరీస్ గెలిచి కొత్త చరిత్ర సృష్టించిన టీమ్ఇండియా వన్డే సిరీస్ దక్కించుకుని ఔరా అనిపించింది. మంగళవారం అర్ధరాత్రి ముగిసిన మూడో వన్డేలో భారత్ 13 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై ఉత్కంఠ విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. భారత్ నిర్దేశించిన 319 పరుగుల లక్ష్యఛేదనలో యువ పేసర్ క్రాంతి గౌడ్(6-52) ఆరు వికెట్ల విజృంభణతో ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో 305 పరుగులకు ఆలౌటైంది.
కెప్టెన్ సీవర్ బ్రంట్(105 బంతుల్లో 98, 11ఫోర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకోగా, ఎమ్మా ల్యాంబ్(68)అర్ధసెంచరీతో ఆకట్టుకుంది. క్రాంతి దూకుడుతో 8 పరుగులకే ఓపెనర్లు అమీ జోన్స్ (4), బ్యూమాంట్ (2) వికెట్లను కోల్పోయిన ఇంగ్లండ్‌ను సీవర్, ల్యాంబ్ ఆదుకున్నారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 162 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే 25 పరుగుల తేడాతో వీరు ఔట్ కావడంతో ఇంగ్లండ్ వికెట్ల పతనం మొదలైంది. అంతకముందు కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌కౌర్ (102) సెంచరీతో టీమ్ఇండియా 50 ఓవర్లలో 318-5 స్కోరు చేసింది. కౌర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’తో పాటు సిరీస్ కూడా దక్కింది.