Paris Olympics 2024 : ఒలింపిక్స్‌లో భారత మహిళా ఆర్చర్ల బృందం తీవ్రంగా నిరాశపరిచింది. ఆదివారం జరిగిన టీమ్ క్వార్టర్ ఫైనల్లో దారుణంగా ఓడింది. తమ కంటే తక్కువ ర్యాంకర్ నెదర్లాండ్స్ జట్టు చేతిలో 0-6తో కంగుతిన్నది. సీనియర్ ఆర్చర్ దీపికా కుమార్ (Deepika Kumari), భజన్ కౌర్(Bhajan Kaur), అంకిత భకత్(Ankita Bhakhat)లతో కూడిన భారత బృందం క్వార్టర్స్‌లో తేలిపోయింది.
క్వాలిఫయింగ్ రౌండ్స్‌లో మెరిసిన అంకిత కీలక పోరులో సరిగ్గా గురి చూడలేకపోయింది. భారత ఆర్చర్లలో భజన్ కౌర్ వరుసగా 10, 9 పాయింట్లు గెలిచి ఆశలు రేపింది. కానీ, దీపిక, అంకితలు మాత్రం నిలకడగా గురి చూసి బాణం విసరలేకపోయారు.
ఈ ఇద్దరూ మరీ ఆధ్వాన్నంగా 4, 6 పాయింట్లతో అందర్నీ షాక్‌కు గురి చేశారు. మరోవైపు డచ్ త్రయం క్వింటీ రొఫ్ఫెన్, గాబి స్కొలెస్సర్, లారా వాన్ డెర్ వింకెల్ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టింది. మూడు రౌండ్లలో వెనకబడిన భారత ఆర్చరీ త్రయం 51-52, 49-54, 48-54తో ఓటమి మూటగట్టుకుంది.