Sumit Nagal : భారత టెన్నిస్ యువకెరటం సుమిత్ నగాల్(Sumit Nagal) కెరీర్లో అత్యుత్తమ ర్యాంక్ సాధించాడు. ఇటీవలే పెరూగియా ఏటీపీ చాలెంజర్స్ (Perugia ATP Challengers)లో రన్నరప్‌గా నిలిచిన అతడు.. ఏటీపీ(ATP) తాజా ర్యాంకింగ్స్‌లో 71వ స్థానం దక్కించుకున్నాడు. ఇంతకుముందు పురుషుల సింగిల్స్‌లో 77వ ర్యాంక్‌తో రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.
భారత టెన్నిస్ ఆశాకిరణంగా కనిపిస్తున్న నగాల్ ఈ ఏడాది సంచలన విజయాలతో ఔరా అనిపిస్తున్నాడు. ప్రతిష్ఠాత్మక ప్యారిస్ ఒలింపిక్స్ బెర్తు సొంతం చేసుకున్న నగాల్ వింబుల్డన్ (Wimbledon) మెయిన్ డ్రాకు అర్హత సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. తద్వారా గడిచిన ఐదేండ్లలో ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా నగాల్ చరిత్ర సృష్టించాడు.
నగాల్ కంటే ముందు ప్రజ్నేష్ గున్నేశ్వరన్ (Prajnesh Gunneshwaran) 2019లో వింబుల్డన్ టోర్నీకి అర్హత సాధించాడు. అయితే.. కెనడాకు చెందిన మిలొస్ రౌనిక్ చేతిలో అతడు ఓడిపోయాడు. ఆ తర్వాత పలువురు స్టార్ ఆటగాళ్లు ఎంతో ప్రయత్నించినా ఎవరూ విజయం సాధించలేదు. కానీ, సూపర్ ఫామ్‌లో ఉన్న నగాల్ ఐదేండ్ల నిరీక్షణకు తెరదించాడు. వింబుల్డన్ టోర్నీ జూలై 1 నుంచి ప్రారంభం కానుంది.
ఈ ఏడాది నగాల్‌కు బాగా కలిసొచ్చిందని చెప్పాలి. అవును.. ఆరంభం నుంచి నగాల్ సంచలనాలకు కేరాఫ్ అయ్యాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ (Australian Open) మెయిన్ డ్రాకు అర్హత సాధించడమే కాకుండా రెండో రౌండ్‌కు దూసుకెళ్లి రికార్డులు నెలకొల్పాడు. ఫిబ్రవరిలో చెన్నై ఓపెన్ విజేతగా అవతరించిన నగాల్.. అనంతరం జర్మనీలో హీల్బ్రాన్ నెక్కర్కప్ ట్రోఫీని కైవసం చేసుకున్నాడు.