Kanchanjunga Express accident : పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై విపక్షాలు రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్‌పై విరుచుకుపడ్డాయి. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ మంత్రి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అశ్వని వైష్ణవ్ రీల్స్ చేయడంలో బిజీ అయ్యారని, ఆయనకు ప్రజల భద్రతను పట్టించుకునే తీరికలేదని మండిపడింది.
గత పదేండ్లుగా నరేంద్ర మోదీ ప్రభుత్వం రైల్వేలను నిర్వీర్యం చేసిందని, కేవలం పబ్లిసిటీకి పరిమితం చేసిందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే భగ్గుమన్నారు. రైల్వేల నిర్వహణలో కేంద్రం దారుణంగా విఫలమైందని, దీనికి మోదీ సర్కార్ బాధ్యత వహించాలని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి మంత్రి అశ్వని వైష్ణవ్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేత ప్రమోద్ తివారీ కోరారు.
తప్పుడు విధానాలు, తప్పుడు చర్యలు, లోపభూయిష్ట నిర్వహణతోనే రైలు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఒడిషాలో జరిగిన ఘోర రైలు ప్రమాదాన్ని మరువక ముందే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని అన్నారు. రైల్వే మంత్రి తక్షణమే రాజీనామ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైల్వే మంత్రిగా అశ్వని వైష్ణవ్ ప్రస్ధానమంతా ప్రచారం, సోషల్ మీడియా కార్యకలాపాలు మినహా జవాబుదారీతనం కొరవడిందని కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్చార్జ్ జైరాం రమేష్ ఆరోపించారు.
Read More :
Aditya Thackeray | ఈవీఎంలు లేకుంటే బీజేపీకి 40 సీట్లు కూడా వచ్చేవి కాదు : ఆదిత్య ఠాక్రే