West Bengal Governor | పశ్చిమ బెంగాల్ లోని కోల్కతా పోలీసులకు రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ కీలక ఆదేశాలు జారీ చేశారని సమాచారం. తక్షణం రాజ్ భవన్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు అక్కడ నుంచి వైదొలగాలని ఆదేశాలు జారీ చేశారని మీడియాలో వార్తలు వచ్చాయి. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల అనంతరం హింసలో బాధితులు.. గవర్నర్ను కలిసేందుకు రాజ్ భవన్కు వస్తే అక్కడ విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు అందుకు అనుమతించడం లేదని గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ దృష్టికి వచ్చింది.
ఈ నేపథ్యంలోనే ఆయన రాష్ట్ర పోలీసులకు నోటీసులు ఇచ్చి ఉంటారని రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి. తన ఆదేశాలను పట్టించుకోని పోలీసుల వల్ల తనకు రక్షణ లేదని గవర్నర్ భావిస్తున్నారని ఆ వర్గాల కథనం. ఇదిలా ఉంటే, రాజ్ భవన్ అధికారుల కథనం ప్రకారం రాజ్ భవన్ నార్త్ గేట్ పోలీస్ ఔట్ పోస్టును ‘జన్ మంచ్ (ప్రజావేదిక)’గా మార్చాలని గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ భావిస్తున్నారు.
సీఆర్పీసీలోని 144 సెక్షన్ పేరుతో ఎన్నికల అనంతర హింస బాధితులను గవర్నర్తో భేటీ కాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని బీజేపీ నేత సువేంధు అధికారి ఆరోపించారు. దీంతో తమకు రాత పూర్వక అనుమతి లభించినా రాజ్ భవన్ కు వెళ్లేందుకు పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారని సువేందు అధికారితోపాటు మరొకరు కలకత్తా హైకోర్టును ఆశ్రయించారు.