పారిస్: భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, హెచ్ఎస్ ప్రణయ్ ప్రతిష్టాత్మక బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో శుభారంభం చేశారు. మంగళవారం ఇక్కడ జరిగిన మహిళల, పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ విఘ్నాన్ని ఈ ఇద్దరూ విజయవంతంగా అధిగమించి రెండో రౌండ్‌కు చేరారు. మాజీ చాంపియన్ సింధు తొలి రౌండ్లో 23-21, 21-6తో ప్రపంచ 69వ ర్యాంకర్, బల్గేరియాకు చెందిన కలొయన నల్బంటొవను చిత్తుచేసింది.
ఆరంభంలో 0-4తో వెనుకబడ్డ సింధు.. మొదటి విరామం తర్వాత పుంజుకుంది. కోర్టులో కుదురుకున్నాక ఆమె వరుస స్మాష్‌లతో పాటు తన ట్రేడ్‌మార్క్ క్రాస్ కోర్టు విన్నర్స్‌తో ఆధిక్యం దిశగా సాగింది. గేమ్ 19-20 వద్ద ఉండగా బల్గేరియా అమ్మాయికి రెండుసార్లు గేమ్ పాయింట్ లభించినా వాటిని ఆమె సద్వినియోగం చేసుకోలేకపోయింది.
అదే సమయంలో ప్రత్యర్థి బలహీనతను ఆసరాగా చేసుకున్న సింధు.. గేమ్‌ను గెలుచుకుంది. ఇక రెండో గేమ్‌లో అయితే పోరు ఏకపక్షమే. సింధు వరుస పాయింట్లతో కలొయనను మట్టికరిపించి రెండో రౌండ్‌కు ముందంజ వేసింది. పురుషుల సింగిల్స్‌లో ప్రణయ్.. 21-18, 21-15తో జోకిమ్ ఓల్డార్ఫ్ (ఫిన్లాండ్)పై అలవోక విజయం సాధించాడు. 47 నిమిషాల్లోనే ముగిసిన పోరులో ప్రణయ్.. ఆరంభం నుంచే తనదైన ఆధిక్యాన్ని ప్రదర్శించి వరుస గేమ్‌లను సొంతం చేసుకుని మ్యాచ్‌ను ముగించాడు.