China Open 2023 : చైనా ఓపెన్(China Open 2023) పురుషుల సింగిల్స్‌లో భారత స్టార్ షట్లర్ల(Indian Shuttlers)కు ఊహించని షాక్ తగిలింది. మొదటి రౌండ్లోనే ఏకంగా ముగ్గురు ఇంటి దారి పట్టారు. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన హెచ్ఎస్ ప్రణయ్ (HS Pranay), లక్ష్య సేన్(Lakshya Sen), ప్రియాన్షు రజావత్(Priyanshu Rajawat)లు ఓటమి పాలయ్యారు. కోపెన్‌హగన్‌లో జరిగిన వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో అదరగొట్టిన ప్రణయ్ మలేషియా ఆటగాడు నింగ్ జే యాంగ్ చేతిలో కంగుతిన్నాడు. గంట ఆరు నిమిషాలు సాగిన మ్యాచ్‌లో 22వ ర్యాంకర్ అయిన నింగ్‌పై 12-21, 21-13, 18-21తో ఓడిపోయాడు.
కామన్వెల్త్ చాంపియన్ లక్ష్య సేన్‌కు డెన్మార్క్ ప్లేయర్ ఆండర్స్ ఆంటోన్సేన్ ఝలక్ ఇచ్చాడు. గంట 18 నిమిషాల పాటు జరిగిన పోరులో ఏ మాత్రం ఆకట్టుకోలేని సేన్ 21-23, 21-16, 9-21తో పరాజయం చెందాడు. యువ కెరటం రజావత్ ఇండోనేషియాకు చెందిన షేసర్ హైరెన్ 13-21, 24-26 చేతిలో చిత్తుగా ఓడిపోయాడు.
లక్ష్య సేన్
మహిళల డబుల్స్‌లోనూ భారత పోరాటం ముగిసింది. త్రీసా జాలీ, గాయత్రీ గోపిచంద్ జోడీ చైనాకు చెందిన చెన్ కింగ్ చెన్, జియా యూ ఫాన్ చేతిలో 18-21, 11-21తో ఓటమి పాలైంది. ఒలింపిక్ విజేత పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్(Kidambi Srikanth) ఈ టోర్నీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. చైనా వేదికగా త్వరలో జరుగనున్న ఆసియా గేమ్స్‌కు సన్నద్ధం కావాలనే ఉద్దేశంతో వీళ్లిద్దరూ వైదొలిగారు.