Paris Olympics : ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత షట్లర్లకు సులువైన ‘డ్రా’ లభించింది. తెలుగు తేజం పీవీ సింధు (PV Sindhu), హెచ్ఎస్ ప్రణయ్ (HS Prannoy)లకు గ్రూప్ దశలో తేలికైన ప్రత్యర్థులు ఎదురుకానున్నారు. దాంతో, ఈ ఇద్దరు అలవోకగా నాకౌట్ దశకు చేరుకునే అవకాశముంది. శుక్రవారం ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య ఐదు విభాగాలకు గానూ నాలుగింటిలో డ్రాలను ప్రకటించింది. అయితే.. పురుషుల డబుల్స్ డ్రాను మాత్రం బీడబ్ల్యూఎఫ్ వాయిదా వేసింది.
బీడబ్ల్యూఎఫ్ వెల్లడించిన డ్రా జాబితాలో సింధు గ్రూప్ ఎమ్‌లో ఉంది. అదే గ్రూప్‌లో ఉన్న క్రిస్టిన్ కుబా (ఈస్టోనియా), పాకిస్థాన్‌కు చెందిన నబాహ్ అబ్దుల్ రజాక్‌లతో భారత షట్లర్ తలపడనుంది. అనంతరం 16వ రౌండ్లో సింధుకు చైనాకు చెందిన హీ బింగ్ జియావోను ఢీకొట్టనుంది. లీగ్ దశ మ్యాచ్‌ల విషయానికొస్తే.. ఇప్పటివరకూ క్రిస్టిన్‌తో సింధు ఆడింది లేదు. కానీ, కామన్వెల్త్ గేమ్స్ 2022లో నబాహ్ను 21-4, 21-11తో అలవోకగా ఓడించింది.

పురుషుల సింగిల్స్‌లో ప్రణయ్‌కు సులువైన డ్రా లభించింది. గ్రూప్ కెలోని లీ డుయో ఫాట్ (వియత్నాం), ఫాబియన్ రొత్(జర్మనీ)లతో ప్రణయ్ ఎదురుపడనున్నాడు. ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్న ఈ యంగ్‌స్టర్ సులువుగా 16వ రౌండ్‌కు చేరే చాన్స్ ఉంది. ఇక మరో భారత షట్లర్ లక్ష్యసేన్‌కు కఠినమైన డ్రా దొరికింది. మూడో సీడ్ జొనాథన్ క్రిస్టీతో అతడికి గట్టి పోటీ ఎదురవ్వనుంది.
19వ సీడ్ అయిన లక్ష్యసేన్ 2020లో జొనాథన్‌ను ఓడించాడు. అయితే.. ఈసారి మళ్లీ ఆ మ్యాజిక్ రిపాట్ చేశాడంటే నాకౌట్ దశలో అడుగుపెడుతాడు. జూలై 26వ తేదీ నుంచి ఒలింపిక్స్ పోటీలు షురూ కానున్నాయి. ఏడుగురితో కూడిన భారత బ్యాడ్మింటన్ బృందానికి పుల్లెల గోపీచంద్ కోచ్‌గా.. లెజెండరీ ఆటగాడు ప్రకాశ్ పదుకొనే ( Prakash Padukone) మెంటార్‌గా వ్యవహరించనున్న విషయం తెలిసిందే.
