Retail Inflation | జూన్ రిటైల్ ద్రవ్యోల్బణం ఆందోళనకర స్థాయిలో మళ్లీ తిరగబడింది. ఆహార ధరలు పెరిగిపోవడంతో జూన్ రిటైల్ ద్రవ్యోల్బణం 5.08 శాతంగా నమోదైంది. గత ఐదు నెలల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.08 శాతానికి పెరగడం ఇదే తొలిసారి. 12 నెలల కనిష్ట స్థాయికి దిగి వచ్చిన గత మే నెల రిటైల్ ద్రవ్యోల్బణం 4.75 శాతం కంటే జూన్ చిల్లర ద్రవ్యో్ల్బణం ఎక్కువ అని శుక్రవారం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు పేర్కొన్నాయి. రిటైల్ ద్రవ్యోల్బణంలో దాదాపు సగం ఉండే ఆహార ద్రవ్యోల్బణం గతేడాది జూన్ నెలలో 4.55 శాతం ఉంటే.. ఈ ఏడాది మే నెలలో 8.69 శాతానికి, గత నెలలో 9.55 శాతానికి పెరిగింది.
జూన్ నెలలో కూరగాయల ధరలు 27.33 శాతం పెరిగాయి. గతేడాది నవంబర్ తర్వాత ఆహార ఉత్పత్తుల ధరలు ఏడాది ప్రాతిపదికన 8 శాతానికి పైగా పెరిగాయి. అయితే ఆర్బీఐ నియంత్రణ స్థాయి 2-6 శాతం మధ్యే ప్రధాన రిటైల్ ద్రవ్యోల్బణం కొనసాగుతున్నా, నాలుగు శాతానికి తగ్గించగలిగితే ఈ ఏడాది వడ్డీరేట్ల తగ్గింపునకు కీలకంగా మారుతుంది. హీట్ వేవ్, సాధారణ స్థాయి కంటే తక్కువ వర్షపాతం నమోదు, అధికంగా కూరగాయలు, పండ్ల ధరలు ఉండటంతో ఆహార ద్రవ్యోల్బణం పెరుగుదలకు కారణాలు.
గతేడాదితో పోలిస్తే జూన్ నెలలో గ్రామీణ ద్రవ్యోల్బణం 4.78 శాతం నుంచి 5.67 శాతానికి పెరిగింది. గత మే నెలలో 5.34 శాతంగా నమోదైంది. పట్టణ ద్రవ్యోల్బణం గతేడాది జూన్ లో 4.96 శాతం ఉంటే.. గత నెలలో 4.39 శాతం నమోదైంది. గత మే నెలలో 4.21 శాతం రికార్డైంది.
కూరగాయల ద్రవ్యోల్బణం 29.32 శాతానికి, పప్పులు – అనుబంధ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 16.1 శాతానికి వృద్ధి చెందింది. ప్రతి ఇంట్లో టమాటాలు, ఉల్లిగడ్డలు, బంగళాదుంపలతో కూరలు చేస్తుంటారు. అయితే గత నెలలో హీట్ వేవ్ తోపాటు ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాల వల్ల పంటల దిగుబడిపై ప్రభావం చూపింది. దీంతో టమాటాలు, ఉల్లిగడ్డలు, బంగాళా దుంపల ధరలు డబుల్ డిజిట్స్ స్థాయికి పెరిగాయి. ఇక ఫ్యుయల్ అండ్ లైట్ ఇన్ ఫ్లేషన్ గత మే నెలలో 3.83 శాతం ఉంటే, గత నెలలో మైనస్ 3.66 శాతానికి పడిపోయింది.