న్యూఢిల్లీ: బ్యూనస్ ఎయిర్స్(అర్జెంటీనా) వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్‌లో భారత షూటర్ల పతక జోరు కొనసాగుతున్నది. శనివారం జరిగిన వేర్వేరు విభాగాల్లో సిఫ్ట్‌కౌర్ సమ్రాకు స్వర్ణం, ఇషాసింగ్ రజత పతకంతో మెరిశారు. మహిళల 25మీటర్ల పిస్టల్ ఫైనల్లో తెలంగాణ యువ షూటర్ ఇషాసింగ్ 35 స్కోరుతో రెండో స్థానంలో నిలువగా, సున్ యుజి(38, చైనా), ఫెంగ్ జియూన్(30, చైనా)వరుసగా స్వర్ణ, కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు.
హోరాహోరీగా సాగిన ఫైనల్లో ఒలింపియన్ కాంస్య విజేత మను భాకర్‌ను ఇషాసింగ్ ఓడించి ముందంజ వేసింది. మరోవైపు మహిళల 50మీటర్ల రైఫిల్-3 పొజిషన్ ఫైనల్లో సిఫ్ట్‌కౌర్ 458.6 పాయింట్లతో స్వర్ణం ఖాతాలో వేసుకోగా, అనీటా మాంగోల్డ్(455.3), అరీనా అలుఖోవా(445.9) వరుసగా రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు.