దుబాయ్: టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా దారుమైన ఆట తీరును ప్రదర్శిస్తున్నది. పాకిస్థాన్, న్యూజిలాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ కోహ్లీసేన చిత్తుగా ఓడింది. ఇండియా ప్రదర్శనపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ కామెంట్ చేశారు. టోర్నమెంట్లో ఇండియా ఆడుతున్న తీరు సరిగా లేదన్నాడు. టీ20 వరల్డ్‌కప్ నుంచి ఇండియా నిష్క్రమించే దశలో ఉందన్నాడు. అద్భుతమైన ట్యాలెంట్ ఉన్న టీమిండియా జట్టు.. టోర్నీలో ఆడుతున్న వైనం బాగాలేదన్నాడు. ఆటగాళ్ల మైండ్‌సెట్, మ్యాచ్‌లో వాళ్లు ప్రదర్శిస్తున్న వైఖరి తప్పుడుగా ఉందని మైఖేల్ వాన్ అభిప్రాయపడ్డాడు.
కివీస్‌తో మ్యాచ్ జరుగుతున్న సమయంలో చేసిన ఓ ట్వీట్లో.. ఇండియన్ ప్లేయర్ల మైండ్‌సెట్‌ను వాన్ తప్పుపట్టాడు. 2010 క్రికెట్ తరహాలో కోహ్లీసేన ఆడుతోందని మరో ట్వీట్లో వాన్ విమర్శలు చేశాడు. ఇండియా పాత కాలం నాటి ఆట ఆడుతోందని, టీ20 ఆడే విధానం మారిపోయిందని వాన్ పేర్కొన్నాడు. నిజం చెప్పాలంటే, ఇండియా జట్టులో ట్యాలెంట్ బాగుందని, కానీ వైట్‌బాల్ క్రికెట్లో చాన్నాళ్ల నుంచి వాళ్లు పెద్దగా రాణించడంలేదని మైఖేల్ తెలిపాడు. వివిధ దేశాల్లో జరుగుతున్న క్రికెట్ లీగ్‌ల్లో ఇండియన్ ప్లేయర్లు ఆడే విధంగా అవకాశాలు ఇవ్వాలని వాన్ సూచన చేశాడు. ఐపీఎల్ మినహా ఇతర లీగ్‌ల్లో ఇండియన్లు ఆడడం లేదని, దాంతో వాళ్ల ట్యాలెంట్ వృధా అవుతోందన్నాడు.
India could be on the way out of this #T20WorldCup .. the mindset & approach with all that talent so far has been so wrong #India
— Michael Vaughan (@MichaelVaughan) October 31, 2021