TT | ఆస్థానా (కజకిస్థాన్): ఆసియా టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్లో భారత ప్యాడ్లర్లు మూడు కాంస్యాలతో మెరిశారు. కజకిస్థాన్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో ఆదివారం మహిళల డబుల్స్ సెమీస్ పోరులో ఐహిక ముఖర్జీ, సుతీర్థ ముఖర్జీ ద్వయం.. 4-11, 9-11, 8-11తో మివా హరిమొటొ, మియు కిహారా (జపాన్) చేతిలో ఓడి కాంస్యంతో సరిపెట్టుకుంది.
ఈ టోర్నీలో ఇదివరకే భారత మహిళల జట్టు (మనికా బత్రా, ఐహిక ముఖర్జీ, సుతీర్థ ముఖర్జీ) చారిత్రాత్మక కాంస్యం నెగ్గగా పురుషుల జట్టు (ఆచంట శరత్ కమాల్, మానవ్ ఠక్కర్, హర్మీత్ దేశాయ్) సైతం కాంస్యం గెలిచిన విషయం తెలిసిందే. 1972 నుంచి ఈ టోర్నీ జరుగుతుండగా మహిళల టీమ్ ఈవెంట్లో భారత్ పతకం గెలవడం ఇదే తొలిసారి కావడం విశేషం.