Tanveer Sangha | భారత్ వేదికగా జరిగే ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియా అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్నది. ఇప్పటికే రికార్డు స్థాయిలో ఐదుసార్లు ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడిన కంగారూలు.. ఆరోసారి అందుకోవాలని చూస్తున్నది. భారత్ పిచ్‌లను దృష్టిలో పెట్టుకుంటూ పక్కా ప్రణాళికతో బరిలోకి దిగుతున్నది. స్టార్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టొయినిస్, స్పెషలిస్టు బ్యాటర్ మార్నస్ లబుషేన్ లాంటి వాళ్లను పక్కకు పెడుతూ యువ స్పిన్నర్ తన్వీర్ సంఘాను జట్టుకు ఎంపిక చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అక్టోబర్‌లో మొదలయ్యే వన్డే ప్రపంచకప్ టోర్నీ కోసం ఆసీస్ అన్ని రకాలుగా అస్త్రశస్త్రాలను తయారుచేసుకుంటున్నది.
తన్వీర్ సంఘా విషయానికొస్తే.. ఆస్ట్రేలియాలో పుట్టి పెరిగిన భారత సంతతి క్రికెటర్. 1990 దశకంలో తన్వీర్ తండ్రి.. భారత్‌లోని పంజాబ్ నుంచి ఆస్ట్రేలియాకు ట్రక్ డ్రైవర్‌గా వలస వెళ్లాడు. తన్వీర్ తల్లి ఒక కంపెనీలో అకౌంటెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నది. 2020లో బిగ్‌బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్ తరఫున తన్వీర్ అరంగేట్రం చేశాడు. తన్వీర్ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకున్న సెలెక్టర్లు న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ఎంపిక చేయడంతో 19 ఏండ్ల వయసులో జాతీయ జట్టులోకి వచ్చాడు. ఇలా గురిందర్ సంధు, స్టూవర్ట్ క్లార్క్, బ్రాన్స్‌బీ కూపర్ తర్వాత ఆసీస్‌కు ఆడిన నాలుగో భారత సంతతి క్రికెటర్‌గా తన్వీర్ నిలిచాడు. అరంగేట్రం బిగ్‌బాష్ సీజన్లో సిడ్నీ తరఫున 14 మ్యాచ్‌ల్లో సంఘా 21 వికెట్లు ఖాతాలో వేసుకుని ఆకట్టుకున్నాడు. కెరీర్ తొలి నాళ్లలో ఫాస్ట్‌బౌలర్‌గా వ్యవహరించిన తన్వీర్ ఆ తర్వాత స్పిన్నర్‌గా మారాడు. 2020లో జరిగిన అండర్-19 ప్రపంచకప్‌లోనూ సంఘా తన స్పిన్ మాయాజాలంతో జట్టులో కీలకంగా వ్యవహరించాడు. రానున్న ప్రపంచకప్‌లోనూ సంఘా రాణిస్తే.. ఆసీస్ స్పిన్ కష్టాలు తీరినట్లే.