టోక్యో: బీడబ్ల్యూఎఫ్ జపాన్ ఓపెన్ సూపర్ -750 టోర్నమెంట్లో భారత పురుషుల డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి ద్వయం శుభారంభం చేసింది. స్వల్ప విరామం అనంతరం ఈ టోర్నీతో మళ్లీ రాకెట్ పట్టిన భారత జోడీ.. జపాన్ ఓపెన్ తొలి రౌండ్లో అలవోక విజయం సాధించింది. బుధవారం ఇక్కడ జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 15వ ర్యాంకు భారత ద్వయం.. 21-18, 21-10తో మిన్ హ్యూక్-కిమ్ డాంగ్ (దక్షిణ కొరియా)ను ఓడించింది.
42 నిమిషాల్లోనే ముగిసిన ఈ పోరు తొలి గేమ్‌లో ప్రత్యర్థికి కాస్త అవకాశమిచ్చిన ఈ జంట.. రెండో గేమ్‌ను మాత్రం పెద్దగా కష్టపడకుండానే ముగించి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్.. 21-11, 21-18తో వాంగ్ జెంగ్ జింగ్ (చైనా)ను ఓడించి ఫస్ట్ రౌండ్ విఘ్నాన్ని విజయవంతంగా అధిగమించాడు. మహిళల సింగిల్స్‌లో డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు మరోసారి తొలి రౌండ్‌కే ఇంటిబాట పట్టింది. సింధు.. 15-21, 14-21తో సిమ్ యు జిన్ (దక్షిణ కొరియా) చేతిలో ఓడింది. ఈ ఏడాది ఫస్ట్ రౌండ్‌కే నిష్క్రమించడం సింధూకు ఇది ఐదోసారి. ఆమెతో పాటు ఉన్నతి హుడా ఓడినా.. మరో మ్యాచ్‌లో అనుపమ ఉపాధ్యాయ.. 21-15, 18-21, 21-18తో భారత్‌కే చెందిన రక్షిత రామ్‌రాజ్‌ను ఓడించి రెండో రౌండ్‌కు ముందంజ వేసింది.