FIH Rankings : పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్యంతో చరిత్ర సృష్టించిన భారత పురుషుల హాకీ జట్టు (India Mens HockeyTeam) ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లింది. ఒలింపిక్స్ ముందు 7వ స్థానంలో ఉన్న భారత్ ఇప్పుడు ఐదో స్థానంలో నిలిచింది. అంతర్జాతీయ హాకీ సమాఖ్య (FIH) సోమవారం వరల్డ్ ర్యాంకింగ్స్ ప్రకటించింది.
విశ్వ క్రీడల్లో సంచలన ఆటతో కంచు మోత మోగించిన టీమిండియా టాప్ 5లో నిలిచింది. మెగా టోర్నీలో స్వర్ణం కొల్లగొట్టిన నెదర్లాండ్స్ (Netherlands) అగ్రస్థానంలో నిలవగా.. రజతం సాధించిన జర్మనీ రెండో స్థానం దక్కించుకుంది. ఇంగ్లండ్, బెల్జియం జట్లు మూడు, నాలుగు స్థానాలు సొంతం చేసుకున్నాయి.
#Hockey World Rankings have been updated following the conclusion of the #Paris2024 #Olympics!
Read more about the biggest movers on the rankings table below 👇
— International Hockey Federation (@FIH_Hockey) August 12, 2024
విశ్వ క్రీడల్లో భారత పురుషుల హకీ జట్టు వరుసగా రెండో కాంస్యం కొల్లగొట్టింది. ఫ్యాషన్ నగరి పారిస్ వేదికగా జరిగిన విశ్వ క్రీడల్లో భారత హాకీ జట్టు అంచనాలకు మించి రాణించింది. టోక్యో ఒలింపిక్స్ కాంస్యం నెగ్గిన టీమిండియా మళ్లీ కంచు మోతతో యావత్ భారతాన్ని సంబురాల్లో ముంచెత్తింది.
సెమీఫైనల్లో జర్మనీపై తడబడిన టీమిండియా కంచు పోరులో మాత్రం జూలు విదిల్చింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (Harmanpreet Singh) డబుల్ గోల్‌తో అదరగొట్టగా స్పెయిన్‌ను 2-1తో ఓడించి చరిత్ర సృష్టించింది. పారిస్ ఒలింపిక్స్‌లో దేశానికి నాలుగో మెడల్ అందించడంతో పాటు 52 ఏండ్ల తర్వాత ఒలింపిక్స్‌లో వరుసగా రెండోసారి కంచు మోత మోగించింది.