కోనరావుపేట, జనవరి 4: భవిష్యత్ అంతా బీఆర్ఎస్దేనని, రానున్న మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేస్తామని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి లక్ష్మీనరసింహారావు ధీమా వ్యక్తం చేశారు. ప్రతీ కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని, కేసీఆర్ పదేళ్ల పాలనపై ప్రజలకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో ప్రజలకు చేసేందేమీలేదని విమర్శించారు. అలవిగాని హామీలిచ్చి.. ఇప్పటి వరకు ఏ ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో నేరవేర్చలేదని మండిపడ్డారు. అందుకే గ్రామాల్లో ఆ పార్టీకి ఆదరణ కరువైందని, కాంగ్రెస్ పేరు చేపితేనే ప్రజలు తిడుతున్నారన్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మ్కలపేటలో ఆదివారం పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈసందర్భంగా నిజామాబాద్ గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ సింగం ప్రసాద్‌తోపాటు అదే గ్రామానికి చెందిన వంద మంది యువకులు, మల్కపేట గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ కార్యకర్త ఎదురుగట్ల చంద్రయ్యగౌడ్ బీఆర్ఎస్లో చేరగా.. వారికి కండువా కప్పి పార్టీలోకి అహ్వానించారు. ఈ సందర్భంగా చల్మెడ మాట్లాడుతూ, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల్లో గుండెల్లో నిలిచిపోయాయని కొనియాడారు. మల్కపేట రిజర్వాయర్ నిర్మించి, కాళేశ్వరం జలాలు తెచ్చి సాగునీరందంచిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని, అబద్ధాలు చెబుతూ ప్రజలను మోసం చేసిందని విమర్శించారు.
ఇప్పటివరకు మల్కపేట రిజర్వాయర్‌కు సంబంధించి కాలువలు కూడా పూర్తి చేయలేదని దుయ్యబట్టారు. కనీసం రైతుల కోసం 3 టీఎంసీలు రిజర్వాయర్‌లోని నింపాలని బీఆర్ఎస్ నాయకులు ప్రెస్‌మీట్ పెట్టి చెబితే తప్పవాళ్లు నీళ్లు నింపే పరిస్థితి లేదన్నారు. కార్యక్రమంలో సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మల్యాల దేవయ్య, సర్పంచులఫోరం మండలాధ్యక్షుడు కుంటెల్లి నాగరాజు, సర్పంచులు మల్యాల స్వామి, మంతెన గీతాంజలి, అవురం మానస, కోల స్వాతి, సీనియర్ నాయకులు న్యాలకొండ రాఘవరెడ్డి, సంకినేని రామ్మోహన్రావు, చంద్రయ్యగౌడ్, మంతెన సంతోష్, జిన్న అనిల్, అవురం శరత్, కోల శ్రీనివాస్, వంశీ, భూంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి
బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ చేసిన అభివృద్ధే గ్రామాల్లో కనిపిస్తున్నది. విద్య, వైద్యం సాగునీరు, ఉద్యోగాలతోపాటు ప్రతి ఇంటికి కేసీఆర్ సంక్షేమ ఫలాలు అందించారు. కానీ, కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది. భవిష్యత్‌లో కూడా కేసీఆర్ సీఎంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అందుకే వంద మంది యువకులతో పార్టీలో చేరాను. పార్టీని బలోపేతం చేయడానికి నా వంతు కృషి చేస్తా. కేటీఆర్, చల్మెడ నాయకత్వంలో ముందుకెళ్తాం.
– సింగం ప్రసాద్, నిజామాబాద్
కాంగ్రెస్ చేసిందేమీ లేదు
కొన్నేండ్లుగా కాంగ్రెస్‌లో సీనియర్ కార్యకర్తగా పని చేసిన. గతంలో కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులు తప్ప కాంగ్రెస్ చేసిందేమీ లేదు. చల్మెడ లక్ష్మీనరసింహారావుతోనే మండలం అభివృద్ధి చెందుతుంది. అధికారంలో ఉన్నా.. లేకున్నా గ్రామంలో గుడి, బడి నిర్మించి గ్రామాన్ని పర్యాటకేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు. చల్మెడ నాయకత్వంలో పార్టీ బలోపేతం కావడంతో అభివృద్ధి సాధ్యమవుతుంది.
– ఎదురుగట్ల అంజయ్యగౌడ్, మల్కపేట