ICC : ఈ ఏడాది భీకర ఫామ్‌లో ఉన్న శ్రీలంక మహిళా జట్టు కెప్టెన్ చమరి ఆటపట్టు (Chamari Athapathuthu) ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపికైంది. జూలై నెలకు గానూ ఆమె ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ (Player Of The Month) అవార్డు గెలుపొందింది. పురుషుల విభాగంలో ఇంగ్లండ్ యువ పేసర్ గస్ అట్కిన్సన్ (Gus Atkinson) విజేతగా నిలిచాడు.
ఆరంగేట్రం సిరీస్‌లోనే అద్భుతంగా రాణించిన అట్కిన్సన్ నామినేట్ అయిన తొలిసారే అవార్డు తన్నుకుపోవడం విశేషం. ఇంగ్లండ్ తరుపుముక్కగా పేరొందిన ఇతడు కెరీర్ ఆరంభంలోనే ఐసీసీ అవార్డు అందుకోవడం గొప్ప గౌరవం అని అన్నాడు. వెస్టిండీస్‌తో లార్డ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టుకు ముందు అట్కిన్సన్ డెబ్యూ క్యాప్ అందుకున్నాడు.
A debut to remember 🤩
In his very first series as a Test cricketer, England pacer bags the ICC Men’s Player of the Month Award 🎖️
— ICC (@ICC) August 12, 2024
వెటరన్ బౌలర్ జేమ్స్ అండర్సన్ (James Anderson)ను ఆశ్చర్యపరుస్తూ ఈ యువకెటరం మొదటి ఇన్నింగ్స్‌లో 7/45, రెండో ఇన్నింగ్స్‌లో 5/61తో వారెవ్వా అనిపించాడు. ఆరు ఇన్నింగ్స్‌ల్లో 22 వికెట్లు తీసిన అట్కిన్సన్ ఇంగ్లండ్ పేస్ బౌలింగ్ అస్త్రంగా మారాడు. అతడి విజృంభణతో బెన్ స్టోక్స్ బృందం స్వదేశంలో వెస్టిండీస్‌ను 3-0తో వైట్ వాష్ చేసింది. అన్నట్టు అట్కిన్సస్ ఈ అవార్డు అందుకోవడం ఇదే మొదటిసారి.
చమరి ఆటపట్టు
ఆటపట్టు విషయానికొస్తే.. సొంతగడ్డపై జరిగిన పదో సీజన్ ఆసియా కప్(Women’s Asia Cup)లో ఆమె విధ్వంసక బ్యాటింగ్ చేసింది. మెగా టోర్నీలో లంకను తొలిసారి చాంపియన్‌గా నిలిపింది. మలేషియాపై సెంచరీ(119 నాటౌట్)తో చెలరేగిన ఆటపట్టు భారత్‌పై ఫైనల్లోనూ కీలక ఇన్నింగ్స్ ఆడింది. దాంతో, ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు కొల్లగొట్టింది.