Vijay | కోలీవుడ్ స్టార్ విజయ్ నటించిన తాజా చిత్రం ‘జన నాయగన్’ విడుదలకు ముందు అనూహ్యంగా అడ్డంకులు ఎదుర్కొంది. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్‌ను సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావించారు. అయితే సెన్సార్ ప్రక్రియ పూర్తికాకపోవడంతో విడుదలపై అనిశ్చితి నెలకొంది. విడుదలకు మరికొన్ని గంటలే మిగిలి ఉన్న సమయంలోనే సినిమాను వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించింది. కొన్ని అనివార్య పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, త్వరలోనే కొత్త విడుదల తేదీని వెల్లడిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు సంస్థ విడుదల చేసిన ప్రకటనలో అభిమానులు, ప్రేక్షకులు చూపుతున్న ప్రేమ, ఉత్సాహం తమకు ఎంతో విలువైనదని పేర్కొంటూ, కొంత ఓపికతో వేచి ఉండాలని విజ్ఞప్తి చేసింది.
‘జన నాయగన్’ విజయ్ కెరీర్లో చివరి చిత్రంగా ప్రచారం పొందుతున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే సెన్సార్ సర్టిఫికెట్ విషయంలో సమస్యలు తలెత్తడం మేకర్స్‌కు తలనొప్పిగా మారింది. గత ఏడాది డిసెంబరులో ఈ సినిమాను సెన్సార్‌కు పంపినప్పుడు, కొన్ని సన్నివేశాలు మరియు డైలాగ్స్‌పై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కొన్ని సీన్స్ తొలగించాలని, మరికొన్ని డైలాగ్స్‌ను మ్యూట్ చేయాలని సెన్సార్ బోర్డు సూచించినట్లు సమాచారం. సూచనల మేరకు మార్పులు చేసిన అనంతరం మళ్లీ సినిమాను సెన్సార్‌కు సమర్పించినప్పటికీ, బోర్డు నుంచి స్పష్టమైన స్పందన రాకపోవడంతో పరిస్థితి మరింత సంక్లిష్టమైంది.
ఈ నేపథ్యంలో కేవీఎన్ ప్రొడక్షన్స్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. సెన్సార్ జాప్యంపై అత్యవసర పిటిషన్ దాఖలు చేసి, విడుదలకు అనుమతి ఇవ్వాలంటూ కోరింది. బుధవారం ఈ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు జరిగాయి. సెన్సార్ బోర్డు తరఫున సొలిసిటర్ జనరల్, నిర్మాణ సంస్థ తరఫున సీనియర్ న్యాయవాది పరాశరన్ వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న జస్టిస్ ఆశా తీర్పును రిజర్వ్ చేస్తూ, జనవరి 9 ఉదయం నిర్ణయం వెల్లడిస్తామని తెలిపారు. కోర్టు తీర్పు వెలువడేలోపు స్పష్టత లేకపోవడంతో, సినిమా విడుదలను తాత్కాలికంగా వాయిదా వేయాల్సి వచ్చిందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ ఒకేసారి విడుదల కావాల్సిన ‘జన నాయగన్’ ప్రస్తుతం పోస్ట్‌పోన్ అయింది. హైకోర్టు తీర్పు వచ్చిన అనంతరం పరిస్థితిని బట్టి కొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటించే అవకాశముందని మేకర్స్ సూచిస్తున్నారు.