రామచంద్రాపురం, జనవరి 4: జీహెచ్ఎంసీ తెల్లాపూర్ డివిజన్‌లోనే విద్యుత్‌నగర్, వెలిమెలను విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, మాజీ సర్పంచ్ మల్లేపల్లి సోమిరెడ్డి ఆధ్వర్యంలో విద్యుత్నగర్కాలనీలో ఒకరోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. అంతకు ముందు విద్యుత్‌నగర్ ముఖద్వారంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీగా వచ్చి దీక్షలో కూర్చున్నారు. బీఆర్ఎస్ నేతల రిలే నిరాహార దీక్షకు విద్యుత్నగర్కాలనీ వాసులు, వెలిమెల గ్రామస్తులు మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం, నాయకుల తీరుతో తెల్లాపూర్‌కు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. విద్యుత్‌నగర్, వెలిమెల గ్రామాన్ని తెల్లాపూర్ నుంచి దూరం చేసి ప్రజలకు నష్టం కలిగిస్తున్నారని మండిపడ్డారు. వార్డుల విభజనతో తెల్లాపూర్‌కు నష్టం జరుగుతున్నా స్థానిక కాంగ్రెస్ నాయకులు నోరు మెదపడం లేదన్నారు. విద్యుత్‌నగర్, వెలిమెల గ్రామాన్ని తెల్లాపూర్ డివిజన్‌లోనే విలీనం చేయాలని, సర్కిల్ కార్యాలయాన్ని తెల్లాపూర్‌లోనే ఉంచాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ హయాంలో తెల్లాపూర్‌లో మున్సిపల్ కార్యాలయ భవనం అద్భుతంగా నిర్మించినట్లు తెలిపారు. తెల్లాపూర్‌లో విశాలంగా మున్సిపల్ కార్యాలయం ఉండడంతో అధికారులు పటాన్చెరు సర్కిల్‌ను తెల్లాపూర్‌కు మారిస్తే, తిరిగి పటాన్‌చెరుకు మార్చేందుకు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డితో పాటు ఇతర నాయకులు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అధికారులు వెంటనే స్పందించి తెల్లాపూర్ ప్రజల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ బుచ్చిరెడ్డి, తెల్లాపూర్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు దేవేందర్‌యాదవ్, మాజీ వైస్‌చైర్మన్ రాములుగౌడ్, మాజీ కౌన్సిలర్లు లచ్చిరామ్, బాబ్జీ, రవీందర్‌రెడ్డి, శ్రీశైలం, నాగరాజు, కొమురయ్య, ఉమేశ్, నాయకులు దయాకర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, రవి, దేవేంద్రాచారి, బాలయ్య, యాదగిరి, మధుసూదన్, యాదగిరిరావు, సుదర్శన్ పాల్గొన్నారు.