బెల్లంపల్లి, జనవరి 4 : రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బెల్లంపల్లి పట్టణంలో గులాబీ జెండా ఎగురవేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పిలుపునిచ్చారు. ఆదివారం బెల్లంపల్లి పట్టణంలోని ఏఎంసీ ఏరియాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు నూనెటి సత్యనారాయణ అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన మున్సిపల్ స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, టీబీజీకేఎస్ సెంట్రల్ కమిటీ సభ్యుడు దాసరి శ్రీనివాస్, బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు బడికల శ్రావణ్‌తో కలిసి మాట్లాడారు. వార్డు పరిధిలో నాయకులు సమన్వయం చేసుకుంటూ కష్టపడి పని చేసి గెలుపు బాటలో పయనించాలని సూచించారు.
మున్సిపాలిటీ పరిధిలోని 34 వార్డుల్లో మెజారీ స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి కార్యకర్తనూ కంటిరెప్పలా కాపాడుకుంటామని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో పార్టీలో వారికి సముచిత స్థానం కల్పిస్తామని తెలిపా రు. ప్రతి వార్డులో ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్ ప్ర జావ్యతిరేక విధానాలను పట్టణవాసులకు సమగ్రంగా వివరించాలన్నారు. ఆరుగ్యారెంటీల్లో నెరవేర్చని హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఉచిత విద్యుత్ పథకం చాలా మంది అర్హులకు రావడం లేద ని, గ్యాస్ సబ్సిడీ డబ్బులు సరిగా బ్యాంకు ఖాతాలో పడడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2500 ఇప్పటికీ ఇవ్వకపోవడంతో మహిళలు ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు.
నియోజకవర్గపరిధిలో అరకొరగా మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్లను కేవలం కాంగ్రెస్ నాయకులు, సానుభూతి పరులకు మాత్రమే కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిటీ సభ్యులు ఒక్కో ఇందిరమ్మ ఇంటికి రూ.50వేల వరకు వసూలు చేశారని ఆరోపించారు. సింగరేణి కార్మికులు, బడాబాబులకు కూడా రూ.5 వేల నుంచి పది వేల వరకు డబ్బులు తీసుకుని అనర్హులకు రేషన్ కార్డులు మంజూరు చేశారన్నారు. స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ టూరిస్టుగా మారి అడపాదడపా నియోజకవర్గానికి వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు చెప్పుకుందామంటే ఎవరికి చెప్పాలో తెలియక ప్రజలు అయోమయంలో ఉన్నారని అసహనం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి రేవెల్లి విజయ్, పట్టణ యూత్ అధ్యక్షుడు సబ్బని అరుణ్, మైనార్టీ అధ్యక్షుడు అలీ, నాయకులు వెంకటరమణ, ఎరుకుల సుందర్రావు, ఎలూరి వెంకటేశ్, సాజిద్, వాజిద్, మురుకూరి చంద్రయ్య, విజ్జిగిరి రాజేందర్, తాళ్లపల్లి మల్లయ్య పాల్గొన్నారు.