భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి అరుదైన ఘనత సాధించాడు. సుదీర్ఘకాలంగా ఇండియా తరఫున ఆడుతున్న ఛెత్రి.. తాజాగా ఆసియా కప్ అర్హత మ్యాచ్ లలో భాగంగా హాంకాంగ్ తో జరిగిన మ్యాచ్ లో గోల్ కొట్టి దిగ్గజ ఫుట్‌బాలర్ ఫెరెన్క్ పుస్కాస్ (హంగేరి) గోల్స్ రికార్డును సమం చేశాడు. అంతర్జాతీయ మ్యాచులలో ఛెత్రికి ఇది 84వ గోల్.
హాంకాంగ్ తో మ్యాచ్ లో ఆట 45వ నిమిషంలో గోల్ కొట్టిన ఛెత్రి.. అంతర్జాతీయ మ్యాచులలో అత్యధిక గోల్స్ కొట్టినవారిలో ఐదో స్థానంలో ఉన్న పుస్కాస్ (84 గోల్స్) తో సమానంగా నిలిచాడు. దీంతో ఛెత్రి ఈ జాబితాలో టాప్-5లో నిలిచాడు.
అంతర్జాతీయ మ్యాచులలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాను చూస్తే.. పోర్చుగల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో 117 గోల్స్ తో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత అలీ దాయి (ఇరాన్ – 109 గోల్స్), మొఖ్తర్ దహరి (మలేషియా – 89 గోల్స్) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. నాలుగో స్థానంలో అర్జెంటీనా సాకర్ స్టార్ లియోనల్ మెస్సీ (86 గోల్స్) ఉండగా ఛెత్రి ఐదో స్థానంలో నిలవడం గమనార్హం. మెస్సీ కంటే ఛెత్రి రెండు గోల్స్ దూరంలోనే ఉన్నాడు.
కాగా.. టాప్-5 లో ఉన్నవారిలో రొనాల్డో, మెస్సీ, ఛెత్రి మాత్రమే ఇప్పుడు ఫుట్‌బాల్ ఆడుతున్నారు. టాప్-10 లో చూస్తే ఏడో స్థానంలో నిలిచిన అలి మొబ్ఖౌట్ (యూఏఈ – 80 గోల్స్) ప్రస్తుతం ఆడుతున్నవారిలో ఉన్నారు. మిగిలినవారంతా గతంలో ఈ రికార్డులు సాధించినవారే. బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే తన అంతర్జాతీయ కెరీర్ లో 77 గోల్స్ చేశాడు.
ఇదిలాఉండగా ఆసియా కప్ గ్రూప్-డి క్వాలిఫయర్స్ లో భాగంగా హాంకాంగ్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ 4-0తో ఘన విజయం సాధించింది. ఛెత్రితో పాటు మన్విందర్ సింగ్, అన్వర్ అలీ, ఇషాన్ పండిట గోల్ లు గోల్స్ సాధించి భారత్ కు తిరుగులేని విజయాన్ని అందించారు.