Rohit Sharma | టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. వెస్టిండీస్ టూర్లో తన బాధ్యతలు ముగించుకున్న రోహిత్ శర్మ.. ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. కెరీర్ తొలినాళ్ల నుంచి తరచూ తిరుమలను దర్శించుకునే అలవాటు ఉన్న హిట్‌మ్యాన్ శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించాడు. కరీబియన్లతో టీ20 సిరీస్ నుంచి రోహిత్ తో పాటు సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాకు విశ్రాంతినివ్వడంతో.. ప్రస్తుతం వీరంతా కుటుంబంతో సరదాగా గడుపుతున్నారు. త్వరలో ఆసియాకప్‌తో ఆటు వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రోహిత్ తిరుమలను సందర్శించుకోవడం విశేషం.
Read more : Harvinder Singh | ప్రాణమైన ఆటను వదిలేసి.. విధి పరీక్షలో నెగ్గిన అసలైన ఆల్‌రౌండర్!
హిట్‌మ్యాన్ రాకతో తిరుమల వీధుల్లో అభిమానులు గుమిగూడారు. రోహిత్‌తో సెల్ఫీలు దిగేందుకు ఫ్యాన్స్ ఎగబడటంతో వారిని నియంత్రించేందుకు సెక్యూరిటీ సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారగా.. అభిమానులు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మెగాటోర్నీ ఆరంభానికి ముందు శ్రీవారిని దర్శించుకోవడంతో.. ఇక వరల్డ్‌కప్‌లో ప్రత్యర్థులకు మోతే అని అభిప్రాయపడుతున్నారు.
Read more : BCCI Twitter | మోదీ మాట విని డీపీ మారిస్తే.. బీసీసీఐ బ్లూటిక్ ఎగిరిపోయింది!
కాగా.. 2019 వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి ముందు కూడా రోహిత్ శర్మ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. ఏడుకొండల వాడి ఆశిస్సులు పొందిన రోహిత్.. ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఆ మెగాటోర్నీలో రికార్డు స్థాయిలో పరుగుల వరద పారించాడు. ఏకంగా ఐదు శతకాలు బాది అందరికంటే అగ్రస్థానంలో నిలిచాడు. ఈ సారి కూడా సేమ్ సీన్ రిపీట్ కావాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.