అడిలైడ్: ఆస్ట్రేలియాతో మూడో టెస్టు కోసం భారత్ సన్మాహాలు మొదలుపెట్టింది. అడిలైడ్ డే అండ్ నైట్ టెస్టులో భారీ ఓటమి తర్వాత టీమ్ఇండియా సిరీస్‌లో మళ్లీ పుంజుకునేందుకు పట్టుదలతో కనిపిస్తున్నది. బ్రిస్బేన్ వేదికగా ఈనెల 14 నుంచి మొదలయ్యే మూడో టెస్టు కోసం అడిలైడ్‌లో ప్రాక్టీస్ మొదలుపెట్టింది. విరాట్‌కోహ్లీ, యశస్వి జైస్వాల్, కెప్టెన్ రోహిత్‌శర్మ, రిషబ్ పంత్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయగా బౌలర్లు ఆకాశ్‌దీప్‌సింగ్, యశ్ దయాల్, హర్షిత్రానా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా ఫామ్‌లేమితో నానా ఇబ్బందులు పడుతున్న కెప్టెన్ రోహిత్‌శర్మ ఎక్కువసేపు నెట్స్‌లో గడిపాడు. రెండో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 9 పరుగులకే పరిమితమైన హిట్‌మ్యాన్ ఎలాగైనా గాడిలో పడాలన్న కసితో ఉన్నాడు. ఓవైపు పేసర్లతో పాటు స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొంటూ షాట్లు ఆడాడు.
గత 12 ఇన్నింగ్స్‌ల్లో 142 పరుగులు మాత్రమే చేసిన రోహిత్ తిరిగి ఫామ్‌లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. పెర్త్ టెస్టులో సెంచరీతో అదరగొట్టిన కోహ్లీ ఎడ్జింగ్ డెలీవరీలు ఎలా ఎదుర్కొవాలో ప్రాక్టీస్ చేశాడు. ఓపెనర్ కేఎల్ రాహుల్ ఎక్కువగా డిఫెన్స్‌కు ప్రాధాన్యమివ్వగా, వికెట్‌కీపర్ రిషబ్ పంత్ భారీ షాట్లు ఆడాడు. పెర్త్ టెస్టులో సూపర్ సెంచరీతో కదంతొక్కిన జైస్వాల్ ఎక్కువ సేపు ప్రాక్టీస్‌లో గడిపాడు.
బౌలర్ల విషయానికొస్తే..ఆకాశ్‌దీప్‌సింగ్, దయాల్, రానాతో పాటు స్పిన్నర్లు జడేజా, అశ్విన్, సుందర్ బౌలింగ్ సాధన చేశారు. వీరికి త్రోడౌన్ స్పెషలిస్టులు సహకారం అందజేశారు. బుమ్రా, సిరాజ్, నితీశ్‌కుమార్ కొద్దిసేపే ప్రాక్టీస్‌కు పరిమితమయ్యారు. బుధవారం భారత జట్టు బ్రిస్బేన్‌కు బయల్దేరి వెళ్లనుంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ముందంజ వేసే సయయం ఆసన్నమైందంటూ క్రికెటర్ల ప్రాక్టీస్ సెషన్ వీడియోను బీసీసీఐ తమ అధికారిక ఎక్స్‌లో ట్వీట్ చేసింది.