గ్వాంగ్జౌ(దక్షిణకొరియా): ఆర్చరీ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత కాంపౌండ్ ఆర్చర్లు నిరాశపరిచారు. పురుషుల టీమ్ ఈవెంట్లో స్వర్ణంతో కొత్త చరిత్ర లిఖించిన మన ఆర్చర్లు వ్యక్తిగత విభాగంలో అదే జోరు కొనసాగించలేకపోయారు. చారిత్రక పసిడి అందించిన రిశబ్ యాదవ్, అమన్ సైనీ, పార్థమేశ్ పతక పోరులో నిలువలేకపోయారు. హోరాహోరీగా సాగిన పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత క్వార్టర్స్‌లో పార్థమేశ్ 10-9(షూటాఫ్) తేడాతో మాతియస్ ఫుల్ట్రన్(డెన్మార్క్) చేతిలో ఓడి నిష్క్రమించాడు.
నాలుగు రౌండ్ల పోరులో ఇద్దరు చెక్కుచెదరని గురితో బాణాలు సంధించడంతో స్కోరు 148-148 సమమైంది. విజేతను నిర్ణయించేందుకు జరిగిన షూటాఫ్‌లో పార్థమేశ్ ఒక పాయింట్ తేడాతో ఓటమివైపు నిలువాల్సి వచ్చింది. మరోవైపు రిశబ్ యాదవ్, అమన్సైనీ క్వార్టర్స్‌లోనే తమ పోరాటాన్ని ముగించారు.