సోఫియా: ప్రతిష్ఠాత్మక స్ట్రాంజా మొమోరియల్ బాక్సింగ్ టోర్నీలో భారత బాక్సర్లు అనామిక, అనుపమ రజత పతకాలు కైవసం చేసుకున్నారు. బల్గేరియా వేదికగా జరుగుతున్న టోర్నీలో మహిళల 50 కేజీల ఫైనల్లో అనామిక 1-4తో హు మియీ (చైనా) చేతిలో పరాజయం పాలైంది. టోర్నీ ఆసాంతం నిలకడగా రాణించిన అనామిక.. తుదిపోరులో ఆకట్టుకోలేకపోయింది. బౌట్ తొలి మూడు నిమిషాలు ప్రత్యర్థికి గట్టిగా బదులిచ్చిన అనామిక.. చివరి వరకు అదే జోరు కొనసాగించలేకపోయింది. మహిళల 81 కేజీల ఈవెంట్ తుదిపోరులో అనుపమ 0-5తో ఎమ్మా గ్రీన్ట్రీ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడింది. పురుషుల 48 కేజీల విభాగంలో గోవింద్ కుమార్ సహానీ రజతం దక్కించుకున్నాడు. ఇతర మహిళల బౌట్లలో శృతి యాదవ్ (70 కేజీలు), కళైవాని (48 కేజీలు), మోనిక (ప్లస్ 81 కేజీలు), పురుషుల విభాగంలో విశ్వామిత్ర (51 కేజీలు), సచిన్ (54 కేజీలు) కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. ఓవరాల్గా ఇప్పటి వరకు ఈ టోర్నీలో భారత బాక్సర్లు 8 పతకాలు సాధించారు.