చెన్నై: దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 1-1తో సమం చేసింది. గత రెండు మ్యాచ్‌లలో విఫలమైన భారత బౌలర్లు కీలక పోరులో సత్తా చాటడంతో ఈ పర్యటనను దక్షిణాఫ్రికా ఓటమితో ముగించింది. పూజా వస్త్రకార్ (4/13), రాధా యాదవ్ (3/6) ధాటికి మొదట బ్యాటింగ్ చేసిన సఫారీలు 17.1 ఓవర్లలో 84 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టులో బ్రిట్స్ (20) టాప్‌స్కోరర్. ఆ జట్టులో బ్రిట్స్‌తో పాటు అన్నెకె (17), కాప్ (10) మినహా మిగిలినవారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.
అరుంధతి రెడ్డి (1/14), దీప్తి శర్మ (1/21) రాణించారు. స్వల్ప ఛేదనను భారత్ అలవోకగా పూర్తిచేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన (40 బంతుల్లో 54 నాటౌట్, 8 ఫోర్లు, 2 సిక్సర్లు), షఫాలీ వర్మ (25 బంతుల్లో 27 నాటౌట్, 3 సిక్సర్లు) వికెట్ నష్టపోకుండా గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశారు. షఫాలీ తన శైలికి విరుద్ధంగా నెమ్మదిగా ఆడినా తొలి ఓవర్లోనే రెండు ఫోర్లు కొట్టిన మంధాన ఆ తర్వాత అదే జోరును కొనసాగించింది. డీ క్లర్క్ 11వ ఓవర్లో రెండు ఫోర్లు, ఓ సిక్సర్ సాధించి అర్ధ సెంచరీతో పాటు మ్యాచ్ విజయాన్ని ఖాయం చేసింది.
సంక్షిప్త స్కోర్లు
దక్షిణాఫ్రికా: 17.1 ఓవర్లలో 84 ఆలౌట్(బ్రిట్స్ 20, బాచ్ 17, వస్ర్తాకర్ 4/13, రాధ 3/6),
భారత్: 10.5 ఓవర్లలో 88/0(మంధాన 54 నాటౌట్, షెఫాలీ 27 నాటౌట్)