కొలంబో: సీనియర్ స్పిన్నర్ స్నేహ్ రాణా (5/43) మరోసారి బంతితో మాయ చేయడంతో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలో భారత మహిళల జట్టు ఉత్కంఠ విజయం సాధించింది. కొలంబోలోని ప్రేమదాస వేదికగా జరుగుతున్న ముక్కోణపు సిరీస్‌లో భాగంగా.. మంగళవారం సౌతాఫ్రికాతో జరిగిన పోరులో టీమ్ఇండియా 15 పరుగుల తేడాతో గెలుపొంది వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. భారత్ నిర్దేశించిన 277 పరుగుల ఛేదనలో సౌతాఫ్రికా ఒకదశలో 41 ఓవర్లలో 206/3తో లక్ష్యం దిశగా సాఫీగా సాగిపోయింది. టాజ్మిన్ బ్రిట్స్ (109), ఆ జట్టు సారథి లారా వోల్వార్డ్ (43) తొలి వికెట్‌కు 140 పరుగులు జోడించినా ఈ ఇద్దరూ క్రీజును విడవడంతో దక్షిణాఫ్రికా తడబడింది.
స్నేహ్ రాణా తో పాటు భారత ఫీల్డర్ల మెరుపు రనౌట్లతో సఫారీలు 49.2 ఓవర్లలో 261 రన్స్ వద్దే కుప్పకూలారు. సెంచరీ తర్వాత రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన టాజ్మిన్.. ఆఖర్లో తిరిగి క్రీజులోకి వచ్చినా ఆ జట్టు పరాభవాన్ని తప్పించలేకపోయింది. తన చివరి ఓవర్ (ఇన్నింగ్స్ 48వ) వేసిన రాణా.. మూడు కీలక వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికాను దెబ్బకొట్టింది. వన్డేలలో ఆమెకు ఇదే తొలి ఫైఫర్. ఈ సిరీస్‌లో శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లోనూ రాణా భారత విజయంలో కీలకపాత్ర పోషించిన విషయం విదితమే. ఇక మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 276 రన్స్ చేసింది. యువ ఓపెనర్ ప్రతీక రావల్ (78) వన్డేలలో వరుసగా ఐదో ఫిఫ్టీ ప్లస్ స్కోరు నమోదు చేయగా హర్మన్‌ప్రీత్ (41), జెమీమా (41), స్మృతి మంధాన (36) రాణించారు.