సౌతాంప్టన్: ఇంగ్లండ్ పర్యటనలో తొలి టీ20 సిరీస్ గెలిచి కొత్త చరిత్ర లిఖించిన జోష్‌లో ఉన్న భారత మహిళల జట్టు.. వన్డేల్లోనూ అదే జోరును కొనసాగించింది. ఇరు జట్ల మధ్య బుధవారం సౌతాంప్టన్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో టీమ్ఇండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది.
భారత బౌలర్లు కట్టడి చేయడంతో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. సోఫీ డంక్లీ (92 బంతుల్లో 83, 9 ఫోర్లు), డేవిడ్సన్ రిచర్డ్స్ (73 బంతుల్లో 53, 2 ఫోర్లు) ఇంగ్లిష్ జట్టును ఆదుకున్నారు. భారత బౌలర్లలో స్నేహ్ రాణా (2/31), క్రాంతి గౌడ్ (2/55) తలా రెండు వికెట్లు పడగొట్టగా తెలుగమ్మాయి శ్రీచరణి (1/46) ఒక వికెట్ తీసింది.
ఇంగ్లండ్ నిర్దేశించిన 259 పరుగుల లక్ష్యాన్ని టీమ్ఇండియా 6 వికెట్లు కోల్పోయి 48.2 ఓవర్లలో 262 పరుగులు చేసింది. దీప్తిశర్మ(64 బంతుల్లో 62 నాటౌట్, 3ఫోర్లు, సిక్స్) అర్ధసెంచరీకి తోడు జెమీమా రోడ్రిగ్స్(48) రాణించింది. ఆఖర్లో అమన్జ్యోత్కౌర్(20 నాటౌట్) ఆకట్టుకుంది. ఓపెనర్లు ప్రతీక రావల్ (36), స్మృతి మందన (28) తొలి వికెట్‌కు 48 పరుగులు జోడించి శుభారంభాన్ని అందించారు. చార్లీ డీన్(2-52)కు రెండు వికెట్లు దక్కాయి.
అరంగేట్ర పేసర్ క్రాంతి గౌడ్ ధాటికి ఇంగ్లండ్.. 4 ఓవర్లకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. క్రాంతి.. తన తొలి ఓవర్లోనే ఓపెనర్ అమీ జోన్స్ (1)ను బౌల్డ్ చేయగా మరుసటి ఓవర్లో బ్యూమంట్ (5)ను లెగ్ బిఫోర్‌గా వెనక్కిపంపింది. కానీ ఆ దశలో కెప్టెన్ నటాలీ సీవర్ (41), ఎమ్మా లంబ్ (39) ఆతిథ్య జట్టును ఆదుకున్నారు. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు 71 రన్స్ జోడించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని విడదీయడానికి గాను హర్మన్‌ప్రీత్.. స్నేహ్ రాణాకు బంతినందించింది. రాణా వరుస ఓవర్లలో ఈ ఇద్దరినీ పెవిలియన్‌కు పంపి భారత్‌కు బ్రేక్‌నిచ్చింది. రాణా 19వ ఓవర్లో లంబ్.. మిడాఫ్ వద్ద హర్మన్‌ప్రీత్‌కు క్యాచ్ ఇచ్చింది. ఆమెనే వేసిన 21వ ఓవర్లో సీవర్ ఇచ్చిన క్యాచ్‌ను మిడ్ వికెట్ వద్ద జెమీమా అద్భుతంగా అందుకుంది.
97 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను మిడిలార్డర్ బ్యాటర్లు డంక్లీ, రిచర్డ్స్ మళ్లీ నిలబెట్టారు. ఈ ఇద్దరూ భారత బౌలర్లను దీటుగా ఎదుర్కుని ఇంగ్లిష్ జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించడంలో కీలకపాత్ర పోషించారు. అర్ధ శతకం తర్వాత రిచర్డ్స్‌ను.. శ్రీచరణి బౌలింగ్‌లో రిచా ఘోష్ స్టంపౌట్ చేసినా ఎకిల్స్టొన్ (23*) అండతో డంక్లీ.. ఆ జట్టు స్కోరును 250 పరుగుల మార్కును దాటించింది.
ఇంగ్లండ్: 50 ఓవర్లలో 258/6 (డంక్లీ 83, రిచర్డ్స్ 53, స్నేహ్ 2/31, క్రాంతి 2/55); భారత్: 48.2 ఓవర్లలో 262-6 (దీప్తిశర్మ 62 నాటౌట్, రోడ్రిగ్స్ 48, డీన్ 2-52, ఎకల్‌స్టోన్ 1-34)