లక్ష్యం మరీ పెద్దదేం కాదు. కెప్టెన్ రోహిత్ దూకుడుతో మ్యాచ్ ‘ఇక ఏకపక్షమే’ అనుకున్నారంతా. కానీ సారథి నిష్కమణ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. బంతి వేగాన్ని సైతం నియంత్రిస్తున్న మందకొడి పిచ్‌పై పరుగుల రాక కష్టమవడంతో పాటు కీలక వికెట్లు కోల్పోవడంతో ఏదో మూల ఓ సందేహం! కానీ వన్డేలలో అద్భుత ఫామ్‌లో ఉన్న గిల్ తన జోరును కొనసాగించి వరుసగా రెండో శతకంతో మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పడంతో చాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ సేన బోణీ కొట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. ఒక దశలో 35 పరుగులకే 5 వికెట్లు కోల్పోయినా తౌహిద్, జకేర్ అద్భుత పోరాటంతో భారత్ ఎదుట పోరాడగలిగే స్కోరును నిలిపింది. సీనియర్ పేసర్ మహ్మద్ షమీ.. ఐదు వికెట్లతో సత్తాచాటాడు.
Team India | దుబాయ్: ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో తొలి విఘ్నాన్ని భారత్ విజయవంతంగా దాటింది. బంతితో బంగ్లాదేశ్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేసిన టీమ్ఇండియా.. ఛేదనలో కాస్త ఇబ్బందులు పడ్డా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (129 బంతుల్లో 101 నాటౌట్, 9 ఫోర్లు, 2 సిక్సర్లు) వీరోచిత శతకంతో టోర్నీలో బోణీ కొట్టింది. పునరాగమనం తర్వాత కీలక టోర్నీ ఆడుతున్న షమీ.. కీలక సమయంలో మునపటి లయను దొరకబుచ్చుకుని ఐదు వికెట్ల (5/53)తో సత్తా చాటడంతో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌట్ అయింది. తౌహిద్ హృదయ్ (118 బంతుల్లో 100, 6 ఫోర్లు, 2 సిక్సర్లు) శతకంతో మెరవగా జకేర్ అలీ (114 బంతుల్లో 68, 4 ఫోర్లు) ఆదుకోవడంతో ఆ జట్టు పోరాడగలిగే స్కోరును సాధించింది. ఛేదనను భారత్ 46.3 ఓవర్లు ఆడాల్సి వచ్చింది. గిల్‌తో పాటు సారథి రోహిత్ శర్మ (36 బంతుల్లో 41, 7 ఫోర్లు), కేఎల్ రాహుల్ (47 బంతుల్లో 41 నాటౌట్, 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించారు. గిల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.
ఛేదనలో భారత ఇన్నింగ్స్‌ను విశ్లేషిస్తే.. కెప్టెన్ రోహిత్ ఉన్నంతసేపు ఒక ఎత్తు అయితే అతడు నిష్క్రమించాక మరో ఎత్తు అని చెప్పక తప్పదు. ముస్తాఫిజుర్ 4వ ఓవర్లో రెండు బౌండరీలతో పరుగుల వేట మొదలుపెట్టిన హిట్‌మ్యాన్ అతడే వేసిన 6వ ఓవర్లో 3 ఫోర్లు బాదాడు. మరో ఎండ్‌లో గిల్ కూడా దూకుడుగా ఆడటంతో 9 ఓవర్లు ముగిసేసరికి భారత్ వికెట్ నష్టపోకుండా 69 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో రెండు ఫిఫ్టీలు, ఓ శతకం బాదిన అతడు.. బంగ్లాతోనూ అదే జోరు కొనసాగించాడు. టీమ్ఇండియా దూకుడు చూస్తే లక్ష్యాన్ని 30 ఓవర్లలోనే పూర్తిచేస్తుందా! అనిపించింది. కానీ టస్కిన్ 10వ ఓవర్లో రోహిత్‌ను ఔట్ చేయడంతో స్కోరు వేగం ఉన్నఫళంగా నెమ్మదించింది. ఇదే సమయంలో బంగ్లా సారథి స్పిన్నర్లకు బంతినివ్వడంతో మందకోడి పిచ్‌పై పరుగుల రాకే గగనమైంది. ఎదుర్కున్న పదో బంతికి సింగిల్ తీసిన కోహ్లీ.. లెగ్‌స్పిన్‌ను ఎదుర్కోవడంలో తంటాలు పడ్డాడు. 38 బంతులాడిన అతడు రిషద్ 23వ ఓవర్లో సౌమ్య సర్కార్‌కు క్యాచ్ ఇచ్చాడు. కోహ్లీ, గిల్ రెండో వికెట్‌కు 77 బంతుల్లో 43 రన్స్ జోడించారు. శ్రేయస్ (15), అక్షర్ (8) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలువలేకపోయారు.
వరుసగా వికెట్లు పడుతున్నా గిల్ వెరవలేదు. క్రీజులో పాతుకుపోయిన అతడు 69 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తిచేశాడు. వన్డే కెరీర్లో హాఫ్ సెంచరీకి ఇన్ని బంతులు తీసుకోవడం గిల్‌కు ఇదే ప్రథమం. బంగ్లాదేశ్ స్పిన్నర్లు భారత్‌పై ఒత్తిడి తేవాలని యత్నించినా గిల్ మాత్రం వారిని దీటుగా ఎదుర్కొన్నాడు. రాహుల్ వచ్చాక వికెట్ల మధ్య వేగంగా పరుగెత్తుతూ ఒక్కో పరుగును కూడగడుతూ లక్ష్యాన్ని కరిగించాడు. 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రాహుల్ ఇచ్చిన క్యాచ్‌ను జకేర్ జారవిడవడంతో బతికిపోయిన రాహుల్ ఆ తర్వాత పట్టుదలగా ఆడాడు. తాంజిమ్ 45వ ఓవర్లో 6, 4 బాదిన అతడు.. టస్కిన్ 46వ ఓవర్లో సింగిల్ తీసి వన్డేలలో 8వ శతకాన్ని పూర్తిచేశాడు. తాంజిమ్ తర్వాతి ఓవర్లో రాహుల్ భారీ సిక్సర్ బాది లాంఛనాన్ని పూర్తిచేశాడు. రాహుల్, గిల్ ఐదో వికెట్‌కు అజేయంగా 87 పరుగులు జతచేశారు.
35/5. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 8.4 ఓవర్లలో చేసిన స్కోరు అది. ఆరంభ ఓవర్లలోనే షమీ, హర్షిత్, అక్షర్ విజృంభణతో ఆ జట్టు కనీసం వంద పరుగులైనా చేస్తుందా? అనిపించింది. కానీ ఆ స్థితి నుంచి బంగ్లాదేశ్ 228 పరుగులు చేసిందంటే అది తౌహిద్, జకేర్ పోరాట ఫలితమే. ఆరో వికెట్‌కు ఈ ఇద్దరూ రికార్డు స్థాయిలో 154 పరుగులు జోడించి బంగ్లాను ఆదుకున్నారు. అక్షర్ 9వ ఓవర్ వరుస బంతుల్లో తాంజిద్ (25), ముష్ఫీకర్ (0)ను ఔట్ చేయగా నాలుగో బంతికి స్లిప్స్‌లో జకేర్ ఇచ్చిన క్యాచ్‌ను రోహిత్ జారవిడవడంతో లైఫ్ దొరికిన అతడు దానిని పూర్తి సద్వినియోగం చేసుకున్నాడు.
రోహిత్ గనక ఈ క్యాచ్ పట్టుంటే వన్డేలలో అక్షర్ తొలి హ్యాట్రిక్ నమోదయ్యేది. తౌహిద్ కూడా కుల్దీప్ 20వ ఓవర్లో మిడాఫ్ వద్ద హార్దిక్ క్యాచ్ మిస్ చేయడంతో బతికిపోయాడు. భారత ఫీల్డింగ్ తప్పిదాలతో క్రీజులో నిలదొక్కుకున్న ఈ ద్వయం ఆచితూచి ఆడుతూ భారత స్పిన్నర్లను దీటుగా ఎదుర్కుంది. అయితే వికెట్‌ను కాపాడుకునే క్రమంలో ఈ ఇద్దరూ నెమ్మదిగా ఆడటంతో రన్‌రేట్ బాగా మందగించింది. 29వ ఓవర్లో ఆ జట్టు వంద పరుగుల మార్కును అందుకుంది. 87 బంతుల్లో జకేర్, 84 బంతుల్లో తౌహిద్ అర్ధ శతకాలు పూర్తిచేశాక గేర్ మార్చారు. స్కోరును పెంచే క్రమంలో జకేర్.. షమీ 43వ ఓవర్లో భారీ షాట్ ఆడబోయి లాంగాన్ వద్ద కోహ్లీకి క్యాచ్ పట్టాడు. నొప్పితోనే ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఈ 24 ఏండ్ల కుర్రాడు.. ఎట్టకేలకు తన కెరీర్లో తొలి శతకాన్ని నమోదుచేశాడు.
13 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రోహిత్ వన్డేలలో 11 వేల మైలురాయిని చేరుకున్న నాలుగో భారత క్రికెటర్ (సచిన్, కోహ్లీ, గంగూలీ ముందున్నారు)గా నిలిచాడు. 261 ఇన్నింగ్స్‌లలో రోహిత్ ఈ ఘనతను అందుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన షమీ.. దానితో పాటు వన్డేలలో 200 వికెట్ల మైలురాయినీ అందుకున్నాడు. 104 ఇన్నింగ్స్‌లలో అతడు ఈ ఘనత సాధించాడు. తద్వారా మిచెల్ స్టార్క్ (102) తర్వాత సక్లయిన్ ముస్తాక్‌తో కలిసి రెండో స్థానంలో నిలిచాడు. భారత్ తరఫున అగార్కర్ (133 మ్యాచ్‌లలో) రికార్డును షమీ బ్రేక్ చేశాడు. బంతులపరంగా చూస్తే స్టార్క్ (5,240 బంతులు) కంటే షమీ (5,126) ముందున్నాడు. అంతేగాక ఐసీసీ వన్డే టోర్నీలలో షమీకి ఐదు వికెట్ల ప్రదర్శన చేయడం ఇది ఐదో సారి. ఇది కూడా రికార్డే. ఈ జాబితాలో స్టార్క్, షాహిద్ అఫ్రిది, గ్లెన్ మెక్‌గ్రాత్.. మూడుసార్లు ఫైఫర్ సాధించారు. ఐసీసీ ప్రపంచకప్, చాంపియన్స్ ట్రోఫీలలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో జహీర్ ఖాన్ (59)ను షమీ (60) అధిగమించాడు.
బంగ్లాదేశ్: 49.4 ఓవర్లలో 228 ఆలౌట్ (తౌహిద్ 100, జకేర్ 68, షమీ 5/53, హర్షిత్ 3/31); భారత్: 46.3 ఓవర్లలో 231/4 (గిల్ 101 నాటౌట్, రోహిత్ 41, రిషద్ 2/38, టస్కిన్ 1/36)