బ్రిస్బేన్: ఆస్ట్రేలియా పర్యటనలో భారత మహిళల జట్టు అదరగొట్టింది. టీ20 సిరీస్‌లో నిరాశపరిచిన రాధా యాదవ్ సారథ్యంలోని భారత ‘ఏ’ జట్టు.. వన్డేల్లో మాత్రం మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 ఆధిక్యంతో నిలిచి సిరీస్‌ను కైవసం చేసుకుంది. బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియా ‘ఏ’తో జరిగిన రెండో వన్డేలో భారత అమ్మాయిలు.. 2 వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయాన్ని అందుకున్నారు. ఆసీస్ నిర్దేశించిన 266 పరుగుల ఛేదనను యువ భారత్.. 49.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి పూర్తిచేసింది. తొలి వన్డేలోనూ మెరిసిన ఓపెనర్ యస్తికా భాటియా (66) మరోసారి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడగా రాధా యాదవ్ (60) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో కదం తొక్కింది. ఆఖర్లో తనూజా కన్వర్ (50) అర్ధ శతకంతో మెరవగా ప్రేమా రావత్ (32*) అద్భుతంగా పోరాడి భారత్‌కు విజయాన్ని అందించారు. 193 పరుగులకే 7 కీలక వికెట్లు కోల్పోయిన దశలో.. తనూజా, రావత్ జోడీ 8వ వికెట్‌కు 68 పరుగులు జోడించి గెలుపును ఖాయం చేసింది. అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్.. నిర్ణీత ఓవర్లలో 265/9 రన్స్ చేసింది. అలిస్సా హీలి (91) తృటిలో శతకం కోల్పోగా కిమ్ గార్త్ (41) రాణించింది. భారత బౌలర్లలో మిన్ను మణి (3/46), సైమా ఠాకూర్ (2/30) ఆతిథ్య జట్టు బ్యాటర్లను కట్టడిచేశారు.