Team India | సిడ్నీ: భారత దిగ్గజ బ్యాటింగ్ ద్వయం రోహిత్ శర్మ (125 బంతుల్లో 121 నాటౌట్, 13 ఫోర్లు, 3 సిక్స్‌లు), విరాట్ కోహ్లీ (81 బంతుల్లో 74 నాటౌట్, 7 ఫోర్లు) మునపటి ఆటను గుర్తుకుతెస్తూ చెలరేగిన వేళ ఆస్ట్రేలియాతో శనివారం జరిగిన మూడో వన్డేలో భారత జట్టుకు ఊరట విజయం దక్కింది. ప్రఖ్యాత సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (ఎస్సీజీ) వేదికగా ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా.. ఆసీస్‌పై 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి సిరీస్‌లో ఆతిథ్య జట్టు ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది. కంగారూలు నిర్దేశించిన 237 పరుగుల ఛేదనలో వింటేజ్ రోకో జోడీ రికార్డులు బద్దలు కొట్టే ఆటతో అలరించడంతో లక్ష్యాన్ని భారత్ 38.3 ఓవర్లలో కెప్టెన్ గిల్ (24) వికెట్ మాత్రమే కోల్పోయి పూర్తిచేసింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆసీస్.. హర్షిత్ రాణా (4/39), వాషింగ్టన్ సుందర్ (2/44) రాణించడంతో 46.4 ఓవర్లలో 236 రన్స్‌కే పరిమితమైంది. రెన్షా (58 బంతుల్లో 56, 2 ఫోర్లు), కెప్టెన్ మిచెల్ మార్ష్ (41) రాణించారు. సిరీస్‌లో 202 రన్స్ చేసిన హిట్‌మ్యాన్‌కే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు లభించాయి.
ఏడు నెలల విరామం తర్వాత భారత జట్టులోకి పునరాగమనం చేసి భారీ అంచనాల నడుమ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన రోహిత్, కోహ్లీ జంట కీలక మ్యాచ్‌లో జూలు విదిల్చింది. సిరీస్ క్లీన్‌స్వీప్ గండాన్ని తప్పించుకోవాలంటే తప్పక గెలవాల్సిన పోరులో ఈ ఇద్దరూ పదేండ్ల క్రితం నాటి రోకోను తలపిస్తూ సీనియర్లుగా తమ కర్తవ్యాన్ని విజయవంతంగా నిర్వర్తించారు. ఛేదనలో ఆరంభం నుంచే ఆసీస్ తురుపుముక్క స్టార్క్‌ను లక్ష్యంగా చేసుకున్న రోహిత్ నాలుగు బౌండరీలతో పరుగుల వేటను మొదలుపెట్టాడు. గిల్ సైతం వేగంగా ఆడటంతో పవర్ ప్లేలో భారత్ 68/0గా నిలిచింది. హాజిల్‌వుడ్ 11వ ఓవర్లో గిల్.. కీపర్ క్యారీకి క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన రన్ మిషన్ కోహ్లీ ఎదుర్కున్న తొలి బంతికి సింగిల్ తీయడంతో స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు బిగ్గరగా అరిచారు. గత రెండు మ్యాచ్‌లలో డకౌట్ అయిన విరాట్.. సింగిల్ తీసి చిరునవ్వులు చిందించాడు. అక్కడ్నుంచి ఈ జోడీ ఆసీస్ బౌలర్లకు ఏమాత్రం అవకాశమివ్వకుండా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసింది. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో కోహ్లీ కాస్త ఇబ్బందిపడ్డా క్రీజులో కుదురుకున్నాక ఈ ద్వయం వెనక్కి తిరిగి చూసుకోలేదు. 63 బంతుల్లో హిట్‌మ్యాన్ ఫిఫ్టీ పూర్తయింది. కొద్దిసేపటికే కోహ్లీ సైతం 56 బంతుల్లో తన కెరీర్లో 75వ అర్ధ శతకాన్ని నమోదుచేశాడు. మ్యాచ్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాక ఈ జోడీ కంగారూ బౌలర్లను అలవోకగా ఎదురుకుంది. కనోలి బౌలింగ్‌లో బౌండరీతో 90లలోకి వచ్చిన రోహిత్.. జంపా 33వ ఓవర్లో ఆఖరి బంతిని లాంగాఫ్ దిశగా తరలించి వన్డే కెరీర్లో 33వ శతకాన్ని సాధించాడు. షార్ట్ బౌలింగ్ 6,4తో హిట్‌మ్యాన్ జట్టును విజయానికి చేరువ చేయగా ఎల్లీస్ బౌలింగ్‌లో బౌండరీతో ఛేదనలో మొనగాడు లాంఛనాన్ని పూర్తిచేశాడు.
అంతకుముందు ఆసీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా ఆ జట్టుకు హెడ్ (29), మార్ష్ శుభారంభమే అందించారు. తొలి వికెట్‌కు 61 రన్స్ జోడించిన ఈ జోడీని పదో ఓవర్లో సిరాజ్ (1/24) విడదీసి వికెట్ల పతనానికి శ్రీకారం చుట్టాడు. మార్ష్‌ను అక్షర్ బౌల్డ్ చేయగా షార్ట్ (30) క్రీజులో కుదురుకునే సమయానికి సుందర్ బౌలింగ్‌లో కోహ్లీ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో ఆ జట్టు మూడో వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలో రాణా.. ఆసీస్ మిడిలార్డర్ పనిపట్టాడు. క్యారీ (24), ఓవెన్ (24) వికెట్లను పడగొట్టి ఆసీస్‌ను కోలుకోనీయకుండా చేశాడు. రెన్షా పోరాడినా అతడికి సహకారం అందిచేవారు లేకపోవడంతో ఆసీస్ తక్కువ స్కోరుకే పరిమితమైంది.
సిడ్నీలో సెంచరీతో ఇంటర్నేషనల్ కెరీర్లో హిట్‌మ్యాన్ శతకాల అర్ధ శతకాన్ని పూర్తిచేశాడు. వన్డేల్లో 33 సెంచరీలు చేసిన రోహిత్.. టెస్టుల్లో 12, టీ20ల్లో ఐదు సార్లు మూడంకెల స్కోర్లు నమోదుచేశాడు. మూడు ఫార్మాట్లలోనూ ఐదు కంటే ఎక్కువ సెంచరీలు చేసినవారిలో రోహిత్‌దే అగ్రస్థానం. వన్డేల్లో రోహిత్ 33 శతకాలు చేయగా అందులో ఛేదనలో చేసినవే 17. ఈ జాబితాలో కోహ్లీ (28) తర్వాత రెండో స్థానం రోహిత్‌దే.
ఆస్ట్రేలియా: 46.4 ఓవర్లలో 236 ఆలౌట్ (రెన్షా 56, మార్ష్ 41, రాణా 4/39, సుందర్ 2/44);
భారత్: 38.3 ఓవర్లలో 237/1 (రోహిత్ 121*, కోహ్లీ 74*)