T20 World Cup | కౌలాలంపూర్: వరుస విజయాలతో మహిళల అండర్-19 ప్రపంచకప్ టోర్నీలో ఫైనల్ చేరిన యువ భారత జట్టు.. ఈ టోర్నీలో ఆదివారం బ్యూమస్ ఓవల్ వేదికగా జరుగబోయే టైటిల్ పోరులో దక్షిణాఫ్రికాతో అమీతుమీ తేల్చుకోనుంది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఈ టోర్నీ బరిలో నిలిచిన మన అమ్మాయిలు.. ఆడిన ఆరు మ్యాచ్‌లలో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించి అజేయంగా నిలిచారు.
రెండో ఎడిషన్‌నూ సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ఇండియా.. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో దుమ్ము రేపుతోంది. ముఖ్యంగా భారత బౌలర్ల ధాటికి ప్రత్యర్థి జట్లు బెంబేలెత్తుతున్నాయి. లెఫ్టార్మ్ స్పిన్నర్లు వైష్ణవి శర్మ, అయూశీ శుక్లాతో పాటు పరుణిక సిసోడియా, పేసర్ జోషిత ధాటికి టీమ్ఇండియాతో ఆడిన జట్లు కనీసం వంద పరుగులు కూడా (ఒక్క ఇంగ్లండ్ తప్ప) చేయలేదంటే మన బౌలింగ్ ఎంత పటిష్టంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో వైష్ణవి (15), అయూషి (12) టాప్-2లో నిలిచారు. బౌలర్ల మెరుపులకు తోడు బ్యాటింగ్‌లో తెలంగాణ యువ సంచలనం గొంగడి త్రిష అంచనాలకు మించి రాణిస్తోంది. ఈ టోర్నీలో ఆమె 6 మ్యాచ్‌లలో 66.25 సగటుతో 265 పరుగులు చేసి టోర్నీ టాప్ స్కోరర్‌గా ఉంది. మరో ఓపెనర్ కమిలిని (135) కూడా రెచ్చిపోతుండటంతో మిడిలార్డర్‌కు బ్యాటింగ్ చేసే అవకాశమే రావడం లేదు. ఫైనల్లోనూ వీళ్లు ఇదే ఫామ్‌ను కొనసాగించాలని భారత్ ఆశిస్తోంది. సెమీస్‌లో ఆస్ట్రేలియాకు షాకిచ్చి ఈ టోర్నీలో తొలిసారి ఫైనల్ చేరిన దక్షిణాఫ్రికా.. భారత జోరును ఏ మేరకు కట్టడి చేస్తుందనేది ఆసక్తికరం.