IND Vs SA | జోహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న యువ భారత జట్టు మరో ద్వైపాక్షిక సిరీస్‌పై కన్నేసింది. నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇప్పటికే 2-1 ఆధిక్యంలో ఉన్న టీమ్ఇండియా.. శుక్రవారం జోహన్నెస్‌బర్గ్ వేదికగా ఆతిథ్య జట్టుతో ఆఖరి మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను 3-1తో పట్టేయాలని సూర్యకుమార్ సేన భావిస్తుండగా నేటి పోరులో అయినా నెగ్గి సిరీస్‌ను సమం చేయాలని సఫారీలు యత్నిస్తున్న నేపథ్యంలో క్రికెట్ అభిమానులకు నేడు మరో పసందైన టీ20 విందు అందనుంది.
ఈ సిరీస్‌లో సంజూ శాంసన్, తిలక్ వర్మ తలా ఓ సెంచరీలతో ఫామ్‌ను చాటుకున్నారు. గత రెండు డకౌట్ల నుంచి బయటపడకుంటే శాంసన్ స్థానానికి మరోసారి ఎసరు తప్పకపోవచ్చు. కొంతకాలంగా విఫలమవుతున్న అభిషేక్ శర్మ కూడా గత మ్యాచ్‌లో అర్ధశతకం బాది గాడిన పడ్డాడు. కానీ ఈ సిరీస్‌లో ‘నయా 360’ సూర్యకుమార్ ఇప్పటిదాకా తన మార్కును చూపలేదు. ఇదే వేదికలో గతేడాది సూర్య.. టీ20లలో తన ఆఖరి శతకాన్ని నమోదుచేశాడు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా రెండో టీ20లో రాణించినప్పటికీ అతడి పాత్రకు న్యాయం చేయడం లేదు. కానీ ‘ఫినిషర్’గా గుర్తింపు పొందుతున్న రింకూ సింగ్ గత 3 మ్యాచ్‌లలోనూ విఫలమయ్యాడు. 3 మ్యాచ్‌లలో కలిపి అతడు చేసింది 28 పరుగులే. తొలి రెండు మ్యాచ్‌లలో ఆరో స్థానాన బ్యాటింగ్‌కు వచ్చిన అతడు.. మూడో టీ20లో ఏడో స్థానంలో వచ్చినా మెరవలేకపోయాడు. 2026లో స్వదేశంలో జరిగే టీ20 ప్రపంచకప్ కోసం ఇప్పటికే సన్నాహకాలు మొదలుపెట్టిన టీమ్ఇండియా.. రింకూ స్థానంతో పాటు జట్టు కాంబినేషన్స్ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంది. మూడో టీ20లో అరంగేట్రం చేసిన రమణ్‌దీప్ సింగ్.. బ్యాటింగ్‌లో మెరిసినా అతడి బౌలింగ్ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు శుక్రవారం మ్యాచ్ పర్యాటక జట్టుకు అద్భుత అవకాశం. సెంచూరియన్‌లో ఆడిన జట్టుతోనే భారత్ నాలుగో మ్యాచ్‌లోనూ బరిలోకి దిగే అవకాశముంది.
సొంతగడ్డపై సిరీస్ జరుగుతున్నప్పటికీ సిరీస్‌లో దక్షిణాఫ్రికా అంచనాలను అందుకోలేకపోతోంది. సీనియర్ల వైఫల్యం ఆ జట్టును తీవ్రంగా వేధిస్తోంది. మార్క్మ్,్ర మిల్లర్, హెండ్రిక్స్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు. తొలి రెండు మ్యాచ్‌లలో ఓపెనర్‌గా వచ్చి విఫలమై గత మ్యాచ్‌లో మూడో స్థానంలో వచ్చినా మార్క్మ్ తేలిపోయాడు. క్లాసెన్, జాన్సెన్ గత మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటం ఆ జట్టుకు కలిసొచ్చేదే. ఓపెనర్ రికెల్టన్ సైతం విఫలమవుతున్నాడు. అద్భుత పోరాటంతో రెండో టీ20ని గెలిపించిన స్టబ్స్‌పై ఆ జట్టు భారీ అంచనాలే పెట్టుకుంది. బౌలర్ల విషయానికొస్తే జాన్సెన్, కొయెట్జీ రాణిస్తున్నప్పటికీ యువ పేసర్లు సిమెలానె, సిపమ్ల, సీనియర్ స్పిన్నర్ కేశవ్ మహారాజ్ సైతం తేలిపోతుండటం సఫారీలను వేధిస్తోంది.
నిర్ణయాత్మక నాలుగో టీ20 జరుగుతున్న జోహన్నెస్బర్గ్తో భారత్‌కు ప్రత్యేక అనుబంధముంది. 2007లో ఐసీసీ నిర్వహించిన మొట్టమొదటి టీ20 ప్రపంచకప్ ఫైనల్లో దాయాది పాకిస్థాన్‌ను ఓడించి ధోనీ సేన ట్రోఫీని ముద్దాడింది ఇక్కడే.
భారత్: అభిషేక్, శాంసన్, సూర్యకుమార్ (కెప్టెన్), తిలక్, హార్దిక్, రింకూ, అక్షర్, రమణ్‌దీప్, వరుణ్, బిష్ణోయ్, అర్ష్‌దీప్;
దక్షిణాఫ్రికా: రికెల్టన్, హెండ్రిక్స్, మార్క్మ్ (కెప్టెన్), స్టబ్స్, క్లాసెన్, మిల్లర్, జాన్సెన్, కొయెట్జీ, సిమెలానె, మహారాజ్, సిపమ్ల