ఇంగ్లిష్ గడ్డపై ఎప్పుడో సాధించాం! కంగారూల నేలపై ఇటీవలే రెండు సార్లు సిరీస్ పట్టాం! న్యూజిలాండ్‌లోనూ రెండు టెస్టు సిరీస్ విజయాలున్నాయి! వెస్టిండీస్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్థాన్, జింబాబ్వే వంటి దేశాలపై అయితే లెక్కేలేదు!!
జొహన్నెస్‌బర్గ్: అందని ద్రాక్షలా ఊరిస్తున్న టెస్టు సిరీస్ విజయాన్ని అందుకునేందుకు దక్షిణాఫ్రికా గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టు.. అందులో మొదటి అంకాన్ని పూర్తి చేసుకొని రెండో టెస్టుకు సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే తొలి (బాక్సింగ్ డే) టెస్టులో గెలిచి 1-0తో ముందంజలో ఉన్న టీమ్ఇండియా సోమవారం నుంచి వాండరర్స్ మైదానంలో జరుగనున్న రెండో టెస్టులోనూ విజయంపై కన్నేసింది. కొత్త ఏడాదిని విజయంతో ప్రారంభించాలనుకుంటున్న కోహ్లీసేన.. గత మ్యాచ్‌లో ఆడిన 11 మందితోనే బరిలోకి దిగే అవకాశాలు ఉండగా.. మొదటి టెస్టులో ఓటమి పాలైన సఫారీ టీమ్.. అందుకు బదులు తీర్చుకోవాలని భావిస్తున్నది. కోహ్లీసేన బ్యాటింగ్, బౌలింగ్‌లో సమ ఉజ్జీగా కనిపిస్తుంటే.. ఆతిథ్య జట్టుకు అనుభవలేమి ప్రధాన సమస్యగా మారింది. వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్.. తొలి టెస్టు తర్వాత అనూహ్యంగా సుదీర్ఘ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడం ఆ జట్టును మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది. దక్షిణాఫ్రికా గడ్డపై ఇతర పిచ్‌లతో పోల్చుకుంటే.. వాండరర్స్ భారత్‌కు అనుకూలమనే చెప్పొచ్చు. ఈ మైదానంలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో టీమ్ఇండియా ఒక్కసారి కూడా ఓటమి పాలవలేదు. రెండు టెస్టులు నెగ్గిన భారత్.. మరో మూడింటిని ‘డ్రా’చేసుకుంది. కాకపోతే మ్యాచ్‌కు వరుణుడి ముప్పు పొంచి ఉండటమే అభిమానులను ఆందోళన పరుస్తున్నది. ఐదు రోజుల్లో నాలుగు రోజులు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బౌన్స్‌కు సహకరించనున్న పిచ్‌పై మన పేస్ దళం మరోసారి విజృంభిస్తే.. సఫారీ గడ్డపై నయా చరిత్ర లిఖించడం పెద్ద కష్టం కాకపోవచ్చు!
మరో ఆరు వికెట్లు పడగొడితే భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా అశ్విన్ రికార్డుల్లోకెక్కనున్నాడు. ప్రస్తుతం అశ్విన్ 429 వికెట్లతో మూడో ప్లేస్‌లో ఉండగా.. అనిల్ కుంబ్లే (619), కపిల్‌దేవ్ (434) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
తుది జట్లు (అంచనా)
భారత్: కోహ్లీ (కెప్టెన్), రాహుల్, మయాంక్, పుజారా, రహానే, పంత్, అశ్విన్, శార్దూల్, షమీ, బుమ్రా, సిరాజ్.
దక్షిణాఫ్రికా: ఎల్గర్ (కెప్టెన్), మార్క్మ్,్ర పీటర్సన్, డసెన్, బవుమా, వెర్రెయిన్, ముల్డర్/జాన్సెన్, రబడ, కేశవ్, ఒలీవర్, ఎంగ్డీ.
పిచ్, వాతావరణం
వాండరర్స్ పిచ్ బౌన్స్‌కు బాగా సహకరించనుంది. ఐసీసీ నుంచి పేలవ పిచ్‌గా గుర్తింపు పొందిన వాండరర్స్‌లో.. గతం కంటే కాస్త తక్కువ బౌన్స్ లభించొచ్చు. మ్యాచ్ జరుగనున్న ఐదు రోజుల్లో నాలుగు రోజులు వర్షం కురిసే అవకాశం ఉండటం ఆందోళన కలిగిస్తున్నది!