హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): డీజీపీ ఆఫీసులోని పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ విభాగంలో డీఎస్పీగా పనిచేసిన సంకిరెడ్డి భీమ్‌రెడ్డి బినామీల ఇండ్లల్లో కోట్ల రూపాయల విలువైన నోట్ల కట్టలు బయటపడ్డాయి. అక్రమాస్తుల పత్రాలు దొరికాయి. సంకిరెడ్డి భీమ్‌రెడ్డిపై జూన్ 27న ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ హైదరాబాద్‌తోపాటు తెలంగాణ, కర్ణాటకలోని పలు ప్రాం తాల్లో ఆస్తులు, భూములు, ఇండ్లు, వాణిజ్య ఆస్తులు, బ్యాంకు డిపాజిట్లు ఉన్నట్టు గుర్తించింది.
జూలైలో నిర్వహించిన సోదాల్లో 16 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టగా మారెట్ విలువ ప్రకారం రూ.150 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్టు అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. కేసులో కీలకంగా మారిన బినామీ ఆస్తులు, వాటికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఏసీబీ దర్యాప్తు కొనసాగుతున్నది. హైదరాబాద్‌లోని ప్రత్యేక ఏసీబీ కేసుల ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి జారీ చేసిన సెర్చ్వారెంట్ల ఆ ధారంగా తాజాగా గురువారం హైదరాబాద్, జహీరాబాద్ పరిధిలోని 10 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.
నిందితుడితో ఆర్థిక, ఇతర లావాదేవీలు ఉన్నట్టు అనుమానిస్తున్న బినామీల ఇండ్లను తనిఖీ చేశా రు. ఆయా ఇండ్లలో లభించిన ఆస్తుల పత్రా లు, లావాదేవీలకు సంబంధించిన రికార్డులు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకుని దర్యాప్తులో భాగంగా పరిశీలిస్తున్నట్టు తెలిపారు. సోదాల్లో బొమ్మ వెంకటేశ్ నివాసంలో రూ.1.35 కోట్ల నగదు లభించింది. విదేశీ కరెన్సీ, సుమారు 14 లీటర్ల విదేశీ మద్యం కూడా గుర్తించారు. విదేశీ మద్యం విషయాన్ని ఏసీబీ అధికారులు ఎక్సైజ్ శాఖకు తెలియజేశారు. దీనిపై చట్టప్రకారం ఎక్సైజ్ అధికారులు కేసు నమోదు చేసే అవకాశం ఉన్నదని ఏసీబీ అధికారులు చెప్పారు.