IND Vs SA | పొట్టి ఫార్మాట్లో భారత్ వరుస విజయాల ప్రస్థానం దిగ్విజయంగా కొనసాగుతున్నది. ప్రత్యర్థి ఎవరైనా సిరీస్ విజయం తమదే అన్న రీతిలో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో టీమ్ఇండియా దూసుకెళుతున్నది. కుర్రాళ్లతో కళకళలాడుతున్న భారత్..సఫారీలపై అదే గెలుపు జోరు కొనసాగించేందుకు సిద్ధమైంది. శాంసన్ ధనాధన్ సెంచరీకి తోడు స్పిన్నర్ల విజృంభణతో తొలి టీ20లో ఘన విజయం సాధించిన టీమ్ఇండియా..ఆదివారం పోరులోనూ అదే రీతిలో సత్తాచాటాలని చూస్తున్నది. మరోవైపు ప్రపంచకప్ ఫైనల్లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న సఫారీలు సొంతగడ్డపై తేలిపోతున్నారు. కనీసం పరువైనా నిలుపుకోవాలనుకుంటున్న దక్షిణాఫ్రికా..భారత్‌కు పోటీనివ్వాలని చూస్తున్నది.
నెబెహా: నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఆదివారం రెండో టీ20 పోరు జరుగనుంది. డర్బన్‌లో భారీ విజయంతో బోణీ కొట్టిన టీమ్ఇండియా అదే ఊపులో సిరీస్‌లో మరింత ముందంజ వేయాలని చూస్తున్నది. నెబెహా(పోర్ట్ ఎలిజబెత్)లోజరిగే మ్యాచ్‌లోనూ విజయం సాధించేందుకు తహతహలాడుతున్నది. సీనియర్లు రోహిత్‌శర్మ, విరాట్‌కోహ్లీ, జడేజా నిష్క్రమణతో కుర్రాళ్లతో ఉన్న జట్టు టీ20ల్లో దుమ్మురేపుతున్నది. అవకాశాలను అందిపుచ్చుకుంటూ యువ క్రికెటర్లు సత్తాచాటుతున్నారు.
తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ సీనియర్ క్రికెటర్ సంజూ శాంసన్ డర్బన్‌లో మరో సూపర్ సెంచరీతో విజృంభించాడు. సఫారీ బౌలర్లను ఊచకోత కోస్తూ అలవోకగా పరుగుల వరద పారించాడు. కెప్టెన్ సూర్యకుమార్ మద్దతుతో తాను ఇలా ఆడుతున్నానంటూ చెప్పుకొచ్చిన శాంసన్..అదే జోరు కొనసాగిస్తే సఫారీలకు కష్టాలు తప్పకపోవచ్చు. శాంసన్‌కు తోడు సూర్యకుమార్, హార్దిక్‌పాండ్యా, తిలక్‌వర్మ, రింకూసింగ్ బ్యాట్లు ఝులిపిస్తే..భారత్‌కు మరోమారు భారీ స్కోరు సాధ్యమే. యువ ఓపెనర్ అభిషేక్‌శర్మ ఫామ్ ఆందోళన కల్గిస్తుండగా, ఆల్‌రౌండర్ రమణ్‌దీప్‌సింగ్ అరంగేట్రం చేసే అవకాశముంది. అర్ష్‌దీప్‌సింగ్ నిలకడగా రాణిస్తుండగా, అవేశ్‌ఖాన్ అడపాదడపా వికెట్లు తీస్తున్నాడు. వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ స్పిన్ తంత్రం పారితే మన ఖాతాలో మరో విజయం చేరినట్లే.
గెలుపు గాడిలో పడేనా:
దక్షిణాఫ్రికా నిలకడలేమితో ఇబ్బంది పడుతున్నది. సొంతగడ్డపై కూడా ఆ జట్టుకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రపంచకప్ తర్వాత వెస్టిండీస్‌తో సిరీస్‌ను 0-3తో కోల్పోయిన సఫారీలు..ఐర్లాండ్‌తో సిరీస్‌ను 1-1తో సమం చేసుకున్నారు. ఇప్పుడు సొంత ఇలాఖాలో టీమ్ఇండియాను ఎలా నిలువరిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
జట్ల అంచనా
భారత్: శాంసన్, అభిషేక్, సూర్యకుమార్(కెప్టెన్), తిలక్‌వర్మ, హార్దిక్, రింకూసింగ్, అక్షర్‌పటేల్/రమణ్‌దీప్, అర్ష్‌దీప్‌సింగ్, రవి బిష్ణోయ్, అవేశ్‌ఖాన్, వరుణ్
దక్షిణాఫ్రికా: రికల్టన్, మార్క్మ్(కెప్టెన్), స్టబ్స్, క్లాసెన్, మిల్లర్, క్రుగర్, జాన్సెన్, సిమ్లెన్, కొట్జె, మహారాజ్, పీటర్/బార్ట్‌మన్