IND vs NZ | ప్రత్యర్థి ఎవరైనా సొంతగడ్డపై అపజయమే లేకుండా దూసుకు పోతున్న భారత క్రికెట్ జట్టు బుధవారం నుంచి మరో అగ్రశ్రేణి జట్టుతో టెస్టు సమరానికి సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా నేటి నుంచే మొదటి టెస్టు ఆరంభం కానున్నది. ఇటీవలే బంగ్లాదేశ్‌తో ముగిసిన రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చేసి జోరుమీదున్న టీమ్ఇండియా.. కివీస్‌పైనా అదే ఫలితాన్ని పునరావృతం చేసి ఆస్ట్రేలియా పర్యటనకు ముందే వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు వరుసగా మూడోసారి చేరాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు స్వదేశంలో ఆస్ట్రేలియాతో పాటు ఇటీవలే శ్రీలంక చేతిలో దారుణ పరాభవాలు ఎదుర్కున్న న్యూజిలాండ్‌కు రోహిత్ అండ్ కో.ను అడ్డుకోవడం పెనుసవాలే.
బెంగళూరు: స్వదేశంలో అభిమానులకు మరోసారి టెస్టు క్రికెట్ మజాను అందించేందుకు రోహిత్ సేన సిద్ధమైంది. సొంతగడ్డపై మంగళవారం నుంచి న్యూజిలాండ్‌తో ‘చిన్నస్వామి’ వేదికగా తొలి టెస్టు ఆడనుంది. బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో బంతితో పాటు బ్యాట్‌తోనూ ప్రత్యర్థికి చుక్కలు చూపించిన రోహిత్ సేన.. న్యూజిలాండ్‌పైనా అదే దూకుడును ప్రదర్శించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. గత కొన్నాళ్ల ప్రదర్శన ఆధారంగా చూసినా ప్రస్తుత ఫామ్ పరంగా చూసుకున్నా ఈ సిరీస్‌లో టీమ్ఇండియానే తిరుగులేని ఫేవరేట్‌గా ఉంది. శుభ్‌మన్ గిల్, యశస్వీ జైస్వాల్ ఫామ్‌లో ఉండటం.. టెస్టులలో పునరాగమనం తర్వాత వికెట్ కీపర్ రిషభ్ పంత్ దూకుడు.. స్పిన్ ఆల్‌రౌండర్లు అశ్విన్, జడేజా ఆల్‌రౌండ్ షో.. బుమ్రా నేతృత్వంలోని పేస్ బలగం.. ఇలా అన్ని విభాగాల్లోనూ భారత్ దుర్భేద్యంగా ఉంది. కానీ కివీస్ పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. గత ఐదు టెస్టులలో ఆ జట్టు 4 మ్యాచ్‌లలో ఓడటం.. ప్రధాన బ్యాటర్లంతా ఫామ్‌లేమితో సతమతమవుతుండగా బౌలర్ల ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉన్న నేపథ్యంలో ఆ జట్టు భారత్‌ను ఎలా అడ్డుకుంటుందనేది ఆసక్తికరం. న్యూజిలాండ్‌తో సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేస్తే ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్ ఫలితంతో సంబంధం లేకుండా భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తును ఖాయం చేసుకునే అవకాశముంది.
ఈ ఏడాది యశస్వీ, గిల్ సూపర్ ఫామ్‌లో కొనసాగుతున్నారు. గిల్ గత పది ఇన్నింగ్స్ (టెస్టు)లలో మూడు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలతో జోరుమీదుండగా జైస్వాల్ గడిచిన 8 ఇన్నింగ్స్‌లలో ఓ డబుల్ సెంచరీతో పాటు ఐదు అర్థ శతకాలు సాధించడం విశేషం. త్వరలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ వంటి కీలక సిరీస్ ఉన్న నేపథ్యంలో ఈ ఇద్దరూ ఫామ్‌ను కొనసాగించడం వారి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందనడంలో సందేహం లేదు. అయితే మెడ కండరాల గాయంతో బాధపడుతున్న గిల్ మ్యాచ్ సమయానికి పూర్తి ఫిట్‌గా లేకుంటే తుది జట్టులో సర్ఫరాజ్ ఖాన్‌ను ఆడించే అవకాశాలున్నాయి. పంత్ కూడా బంగ్లాతో సిరీస్‌లో సెంచరీతో తన పునరాగమనాన్ని ఘనంగా చాటగా అశ్విన్, జడేజా లోయరార్డర్లో బ్యాటింగ్ బాధ్యతలను విజయవంతంగా మోస్తున్నారు. ప్రధాన ఆటగాళ్లంతా జోరుమీదున్నా సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ ఫామ్ భారత్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఏడాది టెస్టులలో కోహ్లీ ఇంతవరకూ ఒక్క ఫిఫ్టీ కూడా చేయలేదు. కెప్టెన్ హిట్‌మ్యాన్ అడపాదడపా బ్యాట్ ఝుళిపిస్తున్నా గత 8 టెస్టులలో అతడి సగటు 35గానే ఉంది. ఈ ఇద్దరూ ఫామ్‌ను అందుకోవడం భారత్‌కు అత్యంత కీలకం.
న్యూజిలాండ్ ప్రస్తుత ఫామ్‌ను బట్టి చూస్తే ఆ జట్టు భారత్‌ను అడ్డుకోవడం కష్టంతో కూడుకున్నదే. తీవ్ర సంక్షోభంలో ఉన్న శ్రీలంక కూడా ఇటీవల న్యూజిలాండ్‌ను 2-0తో ఓడించగా స్వదేశంలో కూడా వారికి ఆస్ట్రేలియా చేతిలో రెండు టెస్టులలోనూ దారుణ పరాభవమే ఎదురైంది. లంక పర్యటనలో ఆ జట్టు బ్యాటర్ ఒక్కరంటే ఒక్కరు కూడా మూడంకెల స్కోరు చేయలేదు. అదీగాక తొలి టెస్టుకు న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ అందుబాటులో లేకపోవడం ఆ జట్టుకు పెద్ద లోటు. బెంగళూరు పిచ్ కూడా స్పిన్నర్లకు అనుకూలించే అవకాశాలుండటంతో జడేజా, అశ్విన్ మాయాజాలన్ని కివీస్ బ్యాటర్లు ఏ మేరకు నిలువరిస్తారో చూడాలి. స్పిన్నర్లతో పాటు పేసర్ బుమ్రా రూపంలోనూ పర్యాటక జట్టుకు ముప్పు పొంచి ఉంది. తొలి టెస్టుకు ముందే న్యూజిలాండ్ యువ పేసర్ బెన్ సీర్స్ మోకాలి గాయంతో సిరీస్ నుంచి తప్పుకోవడం ఆ జట్టుకు మరో షాక్. భారత్‌లో ఇంతవరకూ టెస్టు సిరీస్ నెగ్గని కివీస్ ఈ సిరీస్‌లో ఏ మేరకు ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరం.
బెంగళూరు టెస్టుకు వర్షం ముప్పు పొంచి ఉంది. ఆట సాగే ఐదు రోజుల పాటూ కర్నాటక రాజధానిలో వర్షం కురిసే అవకాశాలు హెచ్చుగా ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. వాన కారణంగా మంగళవారం భారత ప్రాక్టీస్ సెషన్ కూడా రైద్దెంది. మ్యాచ్ జరిగే తొలి రెండు రోజులు 70-90 శాతం, మూడో రోజు 60%, చివరి రెండు రోజులు 25-40 శాతం వర్షం పడే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. బంగ్లాతో కాన్పూర్ టెస్టులోనూ వర్షం వల్లే సుమారు మూడు రోజుల ఆట సాధ్యం కాలేదు. అయితే కాన్పూర్‌తో పోలిస్తే చిన్నస్వామిలో వర్షం నీటిని బయటకు పంపించి మైదానాన్ని సిద్ధం చేసే అత్యాధునిక ‘సబ్‌ఎయిర్ సిస్టమ్’ ఇక్కడ అందుబాటులో ఉంది.
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, టామ్ లాథమ్ (కెప్టెన్), విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ శాంట్నర్, టిమ్ సౌథీ, అజాజ్ పటేల్, విల్ ఒరూర్కె