విశాఖపట్నం: స్వదేశం వేదికగా జరుగనున్న టీ20 ప్రపంచకప్ టోర్నీకి ముందు భారత్ దుమ్మురేపుతున్నది. న్యూజిలాండ్‌పై ఇప్పటికే టీ20 సిరీస్‌ను ఖాతాలో వేసుకున్న టీమ్ఇండియా తాజాగా క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. బుధవారం ఇరు జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్‌కు సాగరతీర నగరం విశాఖపట్నం వేదిక కానుంది. పరుగుల వరద పారుతున్న సిరీస్‌లో భారత్‌కు కివీస్ దీటైన పోటీనివ్వలేకపోతున్నది. టీమ్ఇండియా టాపార్డర్ సూపర్ ఫామ్ మీద ఉంది.
ముఖ్యంగా గత మ్యాచ్‌లో యువ బ్యాటర్ అభిషేక్‌శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగగా, కెప్టెన్ సూర్యకుమార్‌యాదవ్ ఫామ్‌లోకి రావడం జట్టు విజయ అవకాశాలను మెరుగుపర్చుకుంది. వీరికి తోడు ఇషాన్ కిషన్ వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ దుమ్ముదులుపుతుండగా, సంజూ శాంసన్ ఫామ్ మేనేజ్మెంట్ను ఆందోళనకు గురిచేస్తున్నది. బౌలింగ్‌లో బుమ్రా రిథమ్‌లోకి రాగా, హర్షిత్ రానా, అర్ష్‌దీప్‌సింగ్ నిలకడకనబరుస్తున్నారు. స్పిన్నర్లు రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్యాదవ్..వైజాగ్ టీ20 పోరులో కీలకం కానున్నారు. మరోవైపు మిగిలిన రెండింటిలోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని కివీస్ చూస్తున్నది.