మాంచెస్టర్: పసికూన ఐర్లాండ్‌కు సిరీస్‌ను సమర్పించుకుని ఇంగ్లండ్ పర్యటనకు వచ్చిన భారత టీ20 జట్టు.. శనివారం హ్యారీ బ్రూక్ సేనతో రెండో టీ20లో తలపడనుంది. టాపార్డర్ బ్యాటింగ్ సమస్యలు టీమ్ మేనేజ్మెంట్ను ఆందోళనకు గురిచేస్తున్న వేళ.. ఈ మ్యాచ్‌లో అయినా సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ పుంజుకోవాలని టీమిండియా భావిస్తున్నది. ఐర్లాండ్ సిరీస్‌తో పాటు ఇంగ్లండ్‌తో తొలి టీ20లోనూ శాంసన్, ఇషాన్ దారుణంగా విఫలమయ్యారు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని ఆడించాలని డిమాండ్లు ఊపందుకుంటున్న తరుణంలో శాంసన్ ఇకనైనా మేల్కోకుంటే అతడిపై వేటు తప్పదు. ఇషాన్ మెడపైనా కత్తి వేలాడుతున్నది. ఈ ఇద్దరికి తోడు వైస్ కెప్టెన్ తిలక్ వర్మ బ్యాటింగ్ అప్రోచ్‌పై మేనేజ్మెంట్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. మిడిల్ ఓవర్స్‌లో అతడు ఇన్నింగ్స్‌కు జోరు పెంచాల్సిన తరుణంలోనూ నెమ్మదిగా ఆడటం విమర్శలకు తావిస్తున్నది. గత 12 మ్యాచ్‌ల్లో తిలక్ 12 సిక్సర్లు మాత్రమే కొట్టడం గమనార్హం. తొలి టీ20 వర్షంతో రద్దు కాగా మాంచెస్టర్‌లో చిరుజల్లులు పడే ఛాన్స్ ఉన్నా ఈ మ్యాచ్ సజావుగా సాగే అవకాశం ఉంది.