ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీకి సన్నాహకంగా జరుగుతున్న ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉన్న టీమ్ఇండియా మరోమ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌ను కైవసం చేసుకోనేందుకు తహతహలాడుతున్నది. మెగాటోర్నీ కోసం మెరుగైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్న భారత్ అందుకు తగ్గట్లు మార్పులు, చేర్పులు చేస్తున్నది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గాయం నుంచి పూర్తి తేరుకోగా, కెప్టెన్ రోహిత్‌శర్మ ఫామ్‌పై ఆందోళన కల్గిస్తున్నది. విరాట్ రాకతో ఎవరు తమ స్థానాన్ని వదులుకోవాల్సి వస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొనగా, ఫామ్‌లేమి రోహిత్ భవితవ్యంపై ప్రభావం చూపే అవకాశముంది. మరోవైపు టీ20 సిరీస్ ఓటమి ఎదుర్కొన్న ఇంగ్లండ్ ఇప్పుడు చావోరేవో లాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నది. సిరీస్‌లో నిలువాలంటే తప్పక గెలువాల్సిన స్థితిలో ఉంది.
IND vs ENG | కటక్: భారత్, ఇంగ్లండ్ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో కీలక పోరుకు వేళయైంది. ఆదివారం ఇరు జట్ల మధ్య బారాబతి స్టేడియం వేదికగా రెండో వన్డే జరుగనుంది. నాగ్‌పూర్ వన్డేలో ఘన విజయంతో టీమ్ఇండియా జోష్మీదుంటే..కటక్‌లో గెలిచి సిరీస్‌లో నిలువాలని ఇంగ్లండ్ చూస్తున్నది. ఈ నేపథ్యంలో రెండు జట్ల మధ్య ఆసక్తికరపోరుకు ఆస్కారముంది. మోకాలి నొప్పితో తొలి వన్డేకు దూరమైన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పూర్తి ఫిట్నెస్ సాధించడం టీమ్ మేనేజ్మెంట్కు మంచి ఊరట లభించింది. శనివారం జరిగిన ఆప్షనల్ ప్రాక్టీస్ సెషనల్ కోహ్లీ ఎలాంటి ఇబ్బంది లేకుండా గడిపాడని బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ పేర్కొన్నాడు. మరోవైపు ఫార్మాట్‌తో సంబంధం లేకుండా కెప్టెన్ రోహిత్ ఫామ్ ఆందోళన కల్గిస్తున్నది. చాంపియన్స్ ట్రోఫీ ముందు హిట్‌మ్యాన్ టచ్‌లోకి వస్తే టీమ్ఇండియాకు తిరుగండకపోవచ్చు. మరోవైపు టీ20 సిరీస్ ఓటమితో ఒత్తిడిలో ఉన్న ఇంగ్లండ్సిరీస్లో 0-1తో వెనుకంజలో ఉంది. ఆదివారం కటక్ వన్డేలో కూడా ఓడితే సిరీస్ చేజార్చుకున్నట్లే అవుతుంది. ఒక రకంగా కీలకమైన చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లిష్ జట్టుకు ఇబ్బందిగా మారవచ్చు.
కోహ్లీ రీఎంట్రీ:
కటక్ వన్డే ద్వారా కోహ్లీ రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దీంతో తుది జట్టు కూర్పులో మార్పులు, చేర్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోహ్లీ స్థానంలో తొలి వన్డేకు జట్టులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్ అంచనాలకు మించి రాణించాడు. దీంతో అయ్యర్‌ను పక్కకు పెట్టే అవకాశాలు కనిపించడం లేదు. ఇంగ్లండ్ బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటూ అయ్యర్ దూకుడుగా ఆడటం ఇన్నింగ్స్ స్వరూపాన్నే మార్చేసింది. నాగ్‌పూర్ మ్యాచ్ ద్వారా వన్డేలోకి అరంగేట్రం చేసిన యశస్వి జైస్వాల్‌ను తప్పించే అవకాశముంది. ఇది జరిగితే రోహిత్‌కు జతగా శుభ్‌మన్ గిల్ ఓపెనర్ వచ్చే చాన్స్ ఉంది. బౌలింగ్ యూనిట్లో పెద్దగా మార్పులేమి జరుగకపోవచ్చు. ఒకవేళ హర్షిత్‌రాణా స్థానంలో అర్ష్‌దీప్‌సింగ్ జట్టులోకి వచ్చే చాన్స్ ఉంది.
ఇంగ్లండ్‌కు చావోరేవో: సిరీస్‌లో నిలువాలంటే ఇంగ్లండ్ తప్పక గెలువాల్సిన పరిస్థితి ఎదుర్కొంటుంది. భారత స్పిన్నర్లను ఎదుర్కొవడంలో ఇంగ్లండ్ బ్యాటర్లు ఇంకా ఇబ్బందులు పడుతున్నారు. ఈ అడ్డంకిని అధిగమిస్తేనే ఇంగ్లండ్ నిలబుడుతుంది లేకపోతే సిరీస్ టీమ్ఇండియాకు చేజార్చుకున్నట్లే.
జట్ల అంచనా:
భారత్: రోహిత్(కెప్టెన్), జైస్వాల్, గిల్, కోహ్లీ, రాహుల్/పంత్, హార్దిక్, జడేజా, అక్షర్, కుల్దీప్, రాణా/అర్ష్‌దీప్, షమీ.
ఇంగ్లండ్: డకెట్, సాల్ట్, రూట్, బ్రూక్, బట్లర్(కెప్టెన్), లివింగ్‌స్టోన్, బెతెల్, కార్స్, ఆర్చర్, రషీద్, వుడ్/సకీబ్.
కోహ్లీ ఫిట్
టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. మోకాలి గాయంతో ఇంగ్లండ్‌తో తొలి వన్డేకు దూరమైన విరాట్..ఆదివారం జరిగే రెండో వన్డేలో ఆడనున్నాడు. ఈ విషయాన్ని జట్టు బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ శనివారం మీడియా సమావేశంలో వెల్లడించాడు. ‘విరాట్ కోహ్లీ పూర్తి ఫిట్నెస్ సాధించాడు. రెండో వన్డేకు సన్నాహకంగా జరిగిన ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నాడు.