ముంబై: ప్రతిష్టాత్మక మహిళల వన్డే ప్రపంచకప్ టోర్నీని వరుణుడు నీడలా వెంటాడుతూనే ఉన్నాడు. ఇప్పటికే సెమీఫైనల్ బెర్తు దక్కించుకున్న భారత్..తమ ఆఖరి పోరులో బంగ్లాదేశ్‌తో ఆదివారం తలపడ్డ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. వర్షం అంతరాయంతో నిర్ణీత సమయం కంటే రెండున్నర గంటలు ఆలస్యంగా మొదలైన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా…రాధా యాదవ్(3/30) ధాటికి 27 ఓవర్లలో 119/9 స్కోరుకు పరిమితమైంది. పిచ్ పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ తన లైఫ్ట్ఆర్మ్ స్పిన్‌తో రాధా..బంగ్లా పతనంలో కీలకమైంది. రాధా స్పిన్ ఉచ్చులో చిక్కుకున్న బంగ్లా స్వల్ప స్కోరుకే పరిమితమైంది. షమీమ్ అక్తర్(36), షోబన మోస్త్రె(26) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. శ్రీచరణి(2/23) రెండు వికెట్లతో ఆకట్టుకుంది.
లక్ష్యఛేదనకు దిగిన టీమ్ఇండియా వర్షం అంతరాయం కల్గించే సమయానికి 8.4 ఓవర్లలో 57 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి మందన(34 నాటౌట్), అమన్జ్యోత్కౌర్(15 నాటౌట్) రాణించారు. లక్ష్యం సాఫీగా సాగుతున్న సమయంలో వరుణుడు ఎడతెరిపిలేకుండా కురువడంతో మైదానం మొత్తం చిత్తడిగా మారింది. ముఖ్యంగా స్కేర్ ప్రాంతంలో మైదానం తడిగా ఉండటంతో అంపైర్లు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఆడిన 7 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 3 ఓటములు, ఒక రద్దుతో 7 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలువగా, ఆస్ట్రేలియా(13), ఇంగ్లండ్(11), దక్షిణాఫ్రికా(10) టాప్-3లో ఉన్నాయి.
తొలిసారి వన్డే వరల్డ్‌కప్ టైటిల్ గెలుపే లక్ష్యంగా ముందుకెళుతున్న టీమ్ఇండియాకు ప్రతీకా రావల్ రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. బంగ్లాతో మ్యాచ్ 21వ ఓవర్లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ప్రతీక కాలి మడమకు తీవ్ర గాయమైంది. నొప్పితో విలవిలలాడిన ప్రతీకకు సహాయక సిబ్బంది తోడుగా నిలిచారు. గాయంతో సరిగ్గా నడవలేకపోయిన ప్రతీక కుంటుకుంటూ మైదానాన్ని వీడింది. ఈనెల 30న ఆస్ట్రేలియాతో కీలకమైన సెమీస్ నాటికి ప్రతీక అందుబాటులో ఉంటుందా లేదా అన్న దానిపై అస్పష్టత నెలకొన్నది. ఒక వేళ అప్పటికీ పూర్తి స్థాయిలో కోలుకోపోతే టీమ్ఇండియా విజయావకాశాలపై ప్రభావం చూపించనుంది.
న్యూజిలాండ్‌తో జరిగిన ఆఖరి పోరులో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట కివీస్ 38.2 ఓవర్లలో 168 పరుగులకు ఆలౌటైంది. ప్లిమ్మర్ (43), అమెలియా కెర్(35) ఆకట్టుకున్నారు. ఆ తర్వాత లక్ష్యాన్ని ఇంగ్లండ్ 29.2 ఓవర్లలో 172/2 స్కోరు చేసింది. అమీ జోన్స్(86 నాటౌట్) అజేయ అర్ధసెంచరీతో రాణించింది. డివైన్, తుహుహు ఒక్కో వికెట్ తీశారు.